ఒక రకం పింఛన్లు మాత్రమే పెంచారు
వలంటీర్ల వ్యవస్థకు మంగళం పాడినట్లేనా?
నిరుద్యోగ యువతకు మోసం
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
ప్రొద్దుటూరు: గత ఎన్నికల్లో తాము ఓడిపోయామని, చంద్రబాబును నమ్మి ప్రజలు మోసపోయారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి చెప్పారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వాస్తవానికి ఇంకో ఏడాది వరకు ప్రతిపక్ష నేతగా తమకు పని ఉండదని భావించామని, అయితే ఎన్‌డీఏ ప్రభుత్వం తమకు అంత సమయం ఇవ్వలేదని పేర్కొన్నారు. నెలరోజులు కాకముందే ప్రజాసమస్యలను ప్రస్తావించాల్సి వస్తోందన్నారు.
ఎన్నికల సందర్భంగా చంద్రబాబు రూ.3 వేలు ఉన్న వృద్ధాప్య పింఛన్‌ను రూ.4 వేలకు పెంచడంతోపాటు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన వ్యత్యాసాన్ని కలిపి రూ.7 వేలు జూలై 1న చెల్లిస్తామని చెప్పారని గుర్తుచేశారు. ఈ ఒక్క పింఛన్లు మాత్రమే జూలై నెలలో పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఈ ప్రకారం దివ్యాంగుల పింఛన్‌ను రూ.3 వేలు నుంచి రూ.6 వేలకు పెంచడంతోపాటు మూడునెలల వ్యత్యాసాన్ని కలిపి రూ.15 వేలు చెల్లించాల్సి ఉందన్నారు.
మంచానికే పరిమితమైన వారి పింఛన్‌ను రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని చెప్పడంతోపాటు మూడునెలల వ్యత్యాసాన్ని కలిపి రూ.25 వేలు చెల్లిస్తామని చెప్పారన్నారు. డయాలసిస్ పేషెంట్లకు రూ.10 వేలు ఉన్న పింఛన్‌ను రూ.15 వేలకు పెంచుతామని తెలిపారని, ఈ ప్రకారం మూడునెలల వ్యత్యాసాన్ని కలిపి రూ.30 వేలు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు చెప్పిన ప్రకారం ఈ నెల వివిధ రకాలు పెంచి ఇవ్వాల్సి ఉండగా కేవలం వృద్ధాప్య, వితంతు పింఛన్లు మాత్రమే పెంచి మూడునెలల వ్యత్యాసాన్ని కలిపి ఇస్తున్నారన్నారు.
మిగతా పింఛన్లను పెంచలేదని స్వయంగా అధికారులు చెబుతున్నారని తెలిపారు. నిరుద్యోగులు చంద్రబాబు మాటలు నమ్మి ఓట్లు వేశారని, మళ్లీ వారికి మోసమే జరిగిందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వస్తే వలంటీర్లకు రూ.10 వేలు వేతనం పెంచి ఇస్తామని చెప్పిన చంద్రబాబు ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులతో పింఛన్లు పంపిణీ చేయిస్తున్నారన్నారు. దీన్నిబట్టి వలంటీర్ల వ్యవస్థకు మంగళం పాడినట్లేనన్న అనుమానం వ్యక్తమవుతోందని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ భీముని పల్లి లక్ష్మీదేవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment