ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా నాయకులు సమష్టిగా పనిచేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ టీపీసీసీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేపడుతూనే.. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని సూచించారు. బుధవారం మధ్యాహ్నం 3:30కు ఢిల్లీలోని తన నివాసంలో పీసీసీ నేతలతో రాహుల్‌గాంధీ సమావేశమయ్యారు. ఈ భేటీలో వివిధ అంశాలపై నేతలందరి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల పార్టీ చేపట్టిన కార్యక్రమాలను, భవిష్యత్తు ప్రణాళికలనూ ఆరా తీశారు.
క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో టీపీసీసీ నూతన కమిటీ ఏర్పాటయ్యాక రాహుల్‌గాంధీతో ఇదే తొలి సమావేశం కావడం గమనార్హం. ఇందులో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసకృష్ణన్, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ చైర్మన్ మహేశ్వర్‌రెడ్డి, కన్వీనర్ అజ్మతుల్లా హుస్సేన్, వర్కింగ్ ప్రెసిడెంట్లు జె.గీతారెడ్డి, అజారుద్దీన్, మహేశ్‌కుమార్ గౌడ్ పాల్గొన్నారు.
కాగా.. ఈ భేటీకి ముందు మాణిక్యం ఠాగూర్, బోసురాజు, శ్రీనివాసకృష్ణన్‌లతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏఐసీసీ కార్యాలయంలో సమావేశమై పలు అంశాలపై సమీక్షించారు. రాహుల్‌తో సమావేశం తర్వాత రేవంత్‌రెడ్డి బుధవారం రాత్రి పార్టీ రాష్ట్ర నేతలకు తన నివాసంలో విందు ఇచ్చారు.
రాష్ట్ర సంపదను మింగేస్తున్నారు: రేవంత్
రాహుల్‌గాంధీతో సమావేశం జరిగిన తర్వాత పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కల్వకుంట్ల కుటుంబం పెద్ద అనకొండలా మారి రాష్ట్ర సంపద మింగేస్తోందని ఆరోపించారు. గత ఏడున్నరేళ్లలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు చీకటిమయం అయ్యాయని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో నిర్మించే టీఆర్‌ఎస్ కార్యాలయం ఎప్పటికీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక కాబోదని స్పష్టం చేశారు. కేసీఆర్ ఇప్పటికే జిల్లా, రాష్ట్రస్థాయిలో టీఆర్‌ఎస్ పార్టీ ఆఫీసులు కట్టుకున్నారని.. ఇప్పుడు ఢిల్లీలో కేంద్రం ఇచ్చిన స్థలంలో పార్టీ ఆఫీసు కట్టుకుంటున్నారని రేవంత్ పేర్కొన్నారు.
పార్టీ కార్యాలయాలన్నీ కేసీఆర్ కుటుంబ ఆస్తులే తప్ప.. వాటితో తెలంగాణ ప్రజలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అధికారంలోకి వచ్చి ఏడున్నర ఏళ్లు అయినా.. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవమైన అమరవీరుల స్థూపాన్ని ఎందుకు నిర్మించలేకపోయారని ప్రశ్నించారు. అమరువీరులను గౌరవించే ఉద్దేశం బీజేపీకి ఉంటే.. అమరవీరుల స్థూపం నిర్మించుకునేందుకు ఎకరం స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు.
అండగా నిలిచేది కాంగ్రెసే
ఉద్యమకారులు, నిరుద్యోగ యువత, రైతులు, దళితులకు కాంగ్రెస్ పార్టీనే అండగా నిలబడి పోరాడుతోందని రేవంత్ అన్నారు. రాష్ట్రంలో సమస్యలు, అవినీతి, ప్రాజెక్టుల్లో కుంభకోణాల వంటి అంశాలను రాహుల్‌గాంధీకి వివరించి భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించామన్నారు. పార్టీ బలోపేతంపై రాహుల్ సూచనలు, సలహాలు తీసుకున్నామని.. మూడు నెలలకోసారి రాష్ట్రంలో పర్యటించాలని ఆయనను కోరామని రేవంత్ వెల్లడించారు.
డిసెంబర్ 9న రాష్ట్రంలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించామని వివరించారు. ఈనెల 17న గజ్వేల్‌లో నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవానికి కాంగ్రెస్ రాజ్యసభాపక్షనేత మల్లికార్జున ఖర్గే హాజరవుతారని తెలిపారు.
రాజకీయ లబ్ధి కోసమే మోదీతో భేటీ
ప్రధాని మోదీని అడ్డుపెట్టుకొని రాజకీయ లబ్ధి పొందేందుకే సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన చేపట్టారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ టూర్‌లో రాష్ట్ర విభజన చట్టం లోని అంశాలపై చర్చించలేదని, వాటిపై ప్రధాని నుంచి ఎలాంటి హామీ పొందలేదని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీని ఎన్ని స్థానాల్లో నిలబెట్టాలన్న విషయంగా మోదీ, అమిత్ షాల నుంచి కేసీఆర్ సూచనలు తీసుకొన్నారని..అసదుద్దీన్ ఓవైసీని బరిలో దింపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment