
ముంబై: వీర్ సావర్కర్‌పై రాహుల్ గాంధీ రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలో తీవ్ర దుమారం రేపాయి. అయితే గురువారం మరోమారు ఆయన తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి ధైర్యముంటే తాను చేపట్టిన భారత్ జోడో యాత్రను ఆపాలని సవాల్ విసిరారు. ఈ పాదయాత్రలో భాగంగా అకోలా జిల్లాలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు.
ఇది సావర్కర్ విజన్‌కు, మహాత్మగాంధీ విజన్‌కు మధ్య జరుగుతున్న పోరాటం. ఈ విషయంపై చర్చకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. మా పార్టీలో నియంతలు లేరు. అని రాహుల్ పేర్కొన్నారు. అలాగే క్షమాభిక్ష కోసం బ్రిటిషర్లకు సావర్కర్ రాసిన లేఖ ప్రతులను రాహుల్ ఆధారంగా చూపారు. ఆయన బ్రిటిషర్లకు భయపడే ప్రాణభిక్ష ప్రసాదించాలని లేఖ రాశారని పేర్కొన్నారు.
మరోవైపు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. స్వాతంత్ర్య సమరయోధుడైన వీర్ సావర్కర్‌పై రాహుల్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని విమర్శలు గుప్పించింది. హిందుత్వ సిద్ధాంతాలను అమమానిస్తున్న వారికి మహారాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెబుతారని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ ధ్వజమెత్తారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే కూడా రాహుల్ వ్యాఖ్యలను ఖండించారు. సావర్కర్‌ను అవమానించేలా మాట్లాడితే మహారాష్ట్ర ప్రజలు సహించరని హెచ్చరించారు.
ఉద్ధమ్ థాక్రే కూడా రాహుల్ వ్యాఖ్యలపై స్పదించారు. వీర్ సావర్కర్ అంటే తమ పార్టీకి అపార గౌరవం అని స్పష్టం చేశారు. రాహుల్ వ్యాఖ్యలను తాము ధ్రువీకరించబోమని చెప్పారు.
మంగళవారం ఓ ర్యాలీలో మాట్లాడుతూ.. వీర్ సావర్కర్ బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌ల చిహ్నం అని రాహుల్ వ్యాఖ్యానించారు. రెండు మూడేళ్లు అండమాన్ జైళ్లో ఉండగానే.. క్షమాభిక్ష ప్రసాదించాలని బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖలు రాశారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలే మహారాష్ట్రలో రాజకీయ దుమారానికి దారితీశాయి.
చదవండి: అక్రమ మైనింగ్ కేసు.. ఈడీ ఎదుట విచారణకు హాజరైన జార్ఖండ్ సీఎం
Comments
Please login to add a commentAdd a comment