బీజేపీ 150 సీట్లకే పరిమితం: రాహుల్‌ గాంధీ | Sakshi
Sakshi News home page

బీజేపీ 150 సీట్లకే పరిమితం: రాహుల్‌ గాంధీ

Published Wed, Apr 17 2024 12:13 PM

Rahul Gandhi says BJP would win around 180 seats in Ghaziabad UP - Sakshi

లక్నో: లోక్‌సభ ఎన్నికల్లో  బీజేపీ కేవలం 150 సీట్లు మాత్రమే గెలుస్తుందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. ఆయన బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో కాంగ్రెస్‌, ఎస్పీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.  ‘ఎన్ని గెలుస్తామో ముందే జోష్యం చెప్పలేను. 15-20 రోజుల క్రితం బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో 180 సీట్లు గెలుస్తుందని అనుకున్నా. కానీ, బీజేపీ గ్రాఫ్‌ రోజురోజుకి పడిపోతుంది. బీజేపీ కేవలం 150 సీట్లలో మాత్రమే గెలుస్తుంది. మాకు అన్ని రాష్ట్రాల నుంచి రిపోర్టులు అందాయి. కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పెరుగుతోంది. మాది ఉత్తరప్రదేశ్‌లో చాలా బలమైన కూటమి. మాకు మంచి ఫలితాలు వస్తాయి.

గత పదేళ్లలో ప్రధాని మోదీ నోట్లరద్దు చేశారు. బడా వ్యాపారవేత్తల కోసం తప్పడు జీఎస్టీ అమలు చేసి ఉపాధి తగ్గించారు. యువతకు ఉపాధి కోసం మేము 23 విప్లవాత్మకమైన   ఆలోచనలు చేశాం. ఉత్తరప్రదేశ్‌లోని గ్రాడ్యుయేట్లు, డిప్లొమా చేసినవారికి అప్రెంటిస్‌షిప్ హక్కును కల్పిస్తాం. యువత బ్యాంకు ఖాతాలో ఏడాదికి లక్ష రూపాయలు జమ చేస్తాం. కోట్లాది మంది యువతకు ఈ హక్కులు కల్పిస్తాం. పేపర్ లీకులు జరగకుండా చట్టం చేస్తాం’ అని రాహుల్‌ గాంధీ తెలిపారు.

ప్రధాని మోదీ అవినీతికి ఛాంపీయన్‌
ఎలక్టోరల్‌ బాండ్ల స్కీమ్‌ ప్రపంచంలోనే అతి పెద్ద దోపిడి పథకమని అన్నారు. అదేవిధంగా అవినీతిలో ప్రధాని మోదీ ఒక ఛాంపీయన్‌  అని మండిపడ్డారు. ప్రధాని స్క్రిప్ట్‌ ఆధారంగా ఇంటర్వ్యూలో మాట్లడారని ఎద్దేవా చేశారు.  ‘కొన్ని రోజుల కిత్రం ఓ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ మాట్లాడారు. అందులో ఎన్నికల బాండ్ల గురించి ప్రస్తావించారు. ఎ‍న్నికల బాండ్లు రాజకీయాల్లో పారదర్శకత కోసం తీసుకువచ్చామని సమర్థించుకున్నారు. అలాంటప్పుడు సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేసింది. పారదర్శకత కోసమే అయితే బీజేపీకి విరాళాలు ఇచ్చిన వారి పేర్లు ఎందుకు దాచారు. ఏయే తేదీల్లో విరాళాలు అందజేశారో ఎందుకు దాచారు’అని రాహుల్‌ గాంధీ నిలదీశారు.    

సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో  ప్రతిపక్షాల ఇండియా కూటమి అనేది ఒక కొత్త ఆశాకిరణమని తెలిపారు. మెనిఫెస్టోలో పేదరిక నిర్మూలనకు సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయని రాహుల్‌ గాంధీ చెప్పారు. రైతుల ఆదాయం పెంచాలని, పేదరికం నిర్మూలించాలని ఇండియా కూటమిలో అ‍న్ని రాజకీయ పార్టీలు పంటలకు ఎంఎస్పీ మద్దతు ధర కల్పిస్తామని చెబుతున్నాయని తెలిపారు. అదేవిధంగా ప్రతిపక్షాల ఇండియా కూటమి ఘజియాబాద్‌ నుంచి ఘాజీపూర్‌ వరకు బీజేపీని తుడిచిపెడుతుందని అన్నారు. బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవటంతో రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement