
గెహ్లాత్-మోదీ ( ఫైల్ ఫోటో)
జైపూర్ : రాజస్తాన్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతోంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రాకు ఆదివారం లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇప్పటికే మంత్రివర్గ సిఫారసును వెనక్కి పంపిన గవర్నర్.. మరోసారి అదే బాటను ఎంచుకున్నారు. బలపరీక్షపై సరైన స్పష్టత లేదని సీఎం లేఖను వెనక్కి పంపారు. ఇదిలావుండగా.. గవర్నర్ తీరుపై గెహ్లాత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వ్యవహారశైలిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేశారు. సోమవారం మోదీకి స్వయంగా ఫోన్ చేసి గెహ్లాత్ మంత్రివర్గ తీర్మానానికి వ్యతిరేకంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. (రాజస్తాన్‌లో రాజకీయ హైడ్రామా)
దీని ద్వారా రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని, ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించి, ప్రభుత్వాన్ని కాపాడాలని కోరారు. తన రాజకీయ ప్రయాణంలో గవర్నర్ ఈ విధంగా వ్యవహరించడం ఇప్పటి వరకూ చూడలేదని విమర్శించారు. మరోవైపు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. తిరుగుబాటు ఎమ్మెల్యేపై అసెంబ్లీ స్పీకర్ పీసీ జోషీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరించుకున్నారు. ఇదిలావుండగా బీఎస్పీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో విలీనం చేయడంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై రాజస్తాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. (బీఎస్పీ విప్‌తో సంకట స్థితిలో గహ్లోత్ సర్కార్)
Comments
Please login to add a commentAdd a comment