జైసల్మీర్‌కు వెళ్లేందుకు జైపూర్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
జైపూర్/జైసల్మేర్: ఆగస్ట్ 14 నుంచి రాజస్తాన్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. పార్టీ ఎమ్మెల్యేలు వైరి పక్షం చేరకుండా, ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా, శుక్రవారం తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలను జైపూర్ నుంచి ఐదు ప్రత్యేక విమానాల్లో జైసల్మేర్‌కు తరలించారు. వారితో పాటు సీఎం గెహ్లోత్ కూడా ఉన్నారు.
దాదాపు 100 మంది వెళ్లారని పార్టీ వర్గాలు తెలిపాయి. జైసల్మేర్‌లోని హోటల్ సూర్య గఢ్‌లో వారికి విడిది కల్పించారు. సచిన్ పైలట్ నేతృత్వంలో 19 మంది ఎమ్మెల్యేలు రాష్ట్రంలో నాయకత్వ మార్పు కోరుతూ తిరుగుబాటు చేసినప్పటి నుంచి.. గహ్లోత్ తరఫు ఎమ్మెల్యేలంతా జైపూర్ శివార్లలోని ఫెయిర్‌మాంట్ హోటల్‌లో ఉంటున్న విషయం తెలిసిందే.
పోలీసులకు నో ఎంట్రీ
కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు బస చేసిన హరియాణాలోని గురుగ్రామ్, మానేసర్‌ల్లోని రిసార్ట్‌ల్లోకి వెళ్లేందుకు శుక్రవారం రాజస్తాన్ అవినీతి నిరోధక విభాగం పోలీసులకు అనుమతి లభించలేదు. ఒక అవినీతి కేసుకు సంబంధించి ఇద్దరు ఎమ్మెల్యేలు భన్వర్‌లాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్‌లకు నోటీసులు అందజేయడం కోసం ఏసీబీ ఆ రిసార్ట్‌ల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది.
సుప్రీంకోర్టులో చీఫ్ విప్ పిటిషన్
సచిన్ పైలట్ నాయకత్వంలోని 19 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాజస్తాన్ హైకోర్టు అసెంబ్లీ స్పీకర్‌కు ఇచ్చిన ఆదేశాలపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ మహేశ్ జోషి శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
బీజేపీవి ద్వంద్వ ప్రమాణాలు
బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో విలీనం చేసుకోవడంపై బీజేపీ విమర్శ లు చేయడాన్ని సీఎం గహ్లోత్ తప్పుబట్టారు. నలుగురు తెలుగుదేశం పార్టీ ఎంపీలను బీజేపీలో చేర్చుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. కాషాయ పార్టీవి ద్వంద్వ ప్రమాణాలని విమర్శించారు. ‘మీరు నలుగురు టీడీపీ ఎంపీలను చేర్చుకోవడం సరైన చర్యే కానీ.. మేం ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం తప్పా?’అని ట్వీట్ చేశారు. ‘మీకేమైంది? రాత్రింబవళ్లు విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న ప్రజా ప్రభుత్వాలను కూల్చే ఆలోచనలే ఎందుకు చేస్తున్నారు?’అని హోం మంత్రి అమిత్‌షాను గహ్లోత్ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment