
జైసల్మీర్/జైపూర్ : రాజస్తాన్ ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నాలు మానుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ప్రధాని మోదీని అభ్యర్థించారు. సచిన్ పైలట్ నేతృత్వంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలను హైకమాండ్ క్షమిస్తే వారిని అక్కున చేర్చుకుంటానని చెప్పారు. ఆగస్టు 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో తన వర్గం ఎమ్మెల్యేలు చేజారిపోకుండా జైసల్మీర్‌లోని సూర్యగఢ్ రిసార్టుకి తరలించిన విషయం తెలిసిందే. వారితో పాటు ఒక రోజంతా గడిపిన గహ్లోత్ జైపూర్‌కి వెనక్కి తిరిగి రావడానికి ముందు విలేకరులతో మాట్లాడారు.
తిరుగుబాటు ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్ గూటికి వస్తే సాదరంగా ఆహ్వానిస్తానన్న గహ్లోత్ హైకమాండ్‌దే తుది నిర్ణయమని చెప్పారు. కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, ధర్మేంద్ర ప్రధాన్‌లు ప్రభుత్వాన్ని కూల్చి వేసే కుట్రలో ఉన్నారని ఆరోపించారు. నైతిక విలువలకు కట్టుబడి షెకావత్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 200 స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు 19 మంది సహా కాంగ్రెస్ బలం 107 కాగా, బీజేపీకి 72 స్థానాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment