
Rajasthan Assembly Elections 2023: రాజస్థాన్ ఎన్నికల సందర్బంగా 78 ఏళ్ల తీతర్ సింగ్ వార్తల్లో నిలిచారు. వరుసగా 32వ సారి కూడా ఎన్నికల బరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రడీ అయ్యారు. 1970 నుంచి గ్రామపంచాయతీ నుంచి లోక్‌సభ వరకు 31 ఎన్నికల్లో పోటీ చేసిన తీతర్ సింగ్ ప్రతిసారీ ఓటమిని చవిచూశారు. అయితే తగ్గేదెలే అంటూన్న తితార్ సింగ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
రాజస్థాన్‌లోని గంగానగర్‌కు చెందిన 78 ఏళ్ల తీతర్ సింగ్ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) దినసరి కూలీ. తాజా ఎన్నికల్లో వరుసగా స్వతంత్ర అభ్యర్థిగా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. కరణ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పోటీకి సై అన్న తీతర్ సింగ్ ఈ పోటీ వెనుక అసలు ఉద్దేశాన్ని కూడా వెల్లడించారు.
రాష్ట్రంలోని 25ఎఫ్ గులాబేవాలా గ్రామంలో నివాసం ఉంటున్న సౌదాగర్ సింగ్ కుమారుడు తీతర్ సింగ్. చదవింది ఐదవ తరగతి. కరణ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం 1985లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాననీ అన్ని ఎన్నికల్లో ఓడిపోయినా ఆ ఆశ మాత్రం అలాగే ఉంది అంటారు తీతర్ సింగ్. ఎందుకంటే నాలుగు తరాలు గడిచినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అటు పేదలకుగానీ ఇటు గ్రామాభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు.ఇప్పటికైనా పేద ప్రజలకు ప్రభుత్వభూమి, కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
అంతేకాదు తానుఎమ్మెల్యేగా ఎన్నికైతే గ్రామంలోని రోడ్ల అభివృద్ధితో పాటు పలు అభివృద్ధి పనులు చేపట్టడంతోపాటు భూమిలేని పేద కూలీలకు భూమి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరతానని తెలిపారు. ఎన్నికలలో పోటీ చేయడానికి తన మేకలను, ఇంటిని అమ్ముకున్నారట. స్థానికుల నుంచి సేకరించిన కొద్దిపాటి విరాళాలతోనే పోటీకి దిగారు. స్నేహితులతో కలిసి డోర్ టు డోర్ కాన్వాసింగ్ చేయడం మరో ప్రత్యేకత. గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించాలనేది సింగ్ కల అట.
వృద్ధాప్యం కారణంగా చదవడం, రాయడం మర్చిపోయినా సంతకం మాత్రం చేయగలరు. అయినా ఎన్నికల్లో పోటీ చేయడాన్ని మాత్రం వీడలేదు. అంతేకాదు ప్రతీ ఎన్నికలోనూ అతనికి డిపాజిట్ కూడా దక్కలేదు. 2018 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 653 ఓట్లు, 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 427, 2008 అసెంబ్లీ ఎన్నికల్లో 938 ఓట్లు వచ్చాయట. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి సురేంద్ర పాల్ సింగ్, కాంగ్రెస్ నుంచి గుర్మీత్ సింగ్ కూనర్‌తో సింగ్ తలపడనున్నారు.
తీతర్ సింగ్‌కు భార్య గులాబ్ కౌర్, ఇక్బాల్ సింగ్ ,రిచ్‌పాల్ సింగ్ అనే ఇద్దరు కుమారులున్నారు. ఈసారి ఎన్నికల్లో భార్యా పిల్లలు తనకు మద్దతుగా నిలిచారని సింగ్ చెప్పారు. కాగా రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే నెలకొంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సదర్‌పుర అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఇప్పటికే నామినేషన్ వేశారు. ఇక్కడ నవంబర్ 25న పోలింగ్, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Titar singh srikaranpur nirdlay akele dum lde 💪🏻 pic.twitter.com/nuWGnNmI9k
— Rajan Gupta (@rajangupta066) November 2, 2023