కడప కార్పొరేషన్ : రాయలసీమకు చేసిన ద్రోహానికి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ ముక్కును నేలకు రాసి క్షమాపణ కోరాలని అన్నమయ్య జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, శాసనసభ వ్యవహారాల సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్సార్ జిల్లా కడపలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. లోకేశ్ మిడిమిడి జ్ఞానంతో ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదువుతూ ఈవెంట్ మేనేజ్‌మెంట్ తరహాలో యాత్ర చేస్తున్నారని విమర్శించారు.
ప్రజలతో మమేకం కాకుండా 19 గంటలు టెంట్‌లో ఉంటూ, ఐదు గంటలు మాత్రమే బయట తిరుగుతున్నారని, అందులో ఒక గంల సెల్ఫీలకే సరిపోతోందని శ్రీకాంత్ ఎద్దేవా చేశారు. మొత్తం మీద అది పాదయాత్రలా కాకుండా ఒంటిపూట యాత్రలా ఉందన్నారు. కడప పర్యటనలో లోకేశ్ ‘రాయలసీమ డిక్లరేషన్’ అని మాట్లాడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు.
గత 27 ఏళ్లలో 14 ఏళ్లు మీ తండ్రి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఇన్నేళ్లలో రాయలసీమకు ఆయన చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామో చెప్పకుండా, మళ్లీ అధికారవిుస్తే చేస్తామని చెప్పడం మోసపూరితమన్నారు. రాయలసీమ ప్రజలను రౌడీలు, గూండాలుగా, ఫ్యాక్షనిస్టులుగా చిత్రీకరించి వారి మనోభావాలు దెబ్బతీశారన్నారు.
ప్రాజెక్టులు పూర్తిచేయకుండా కాలయాపన..
తెలుగుగంగ ప్రాజెక్టును దివంగత ఎన్టీఆర్ చేపడితే వైఎస్సార్ పూర్తిచేశారని శ్రీకాంత్ తెలిపారు. పదేళ్లు సీఎంగా ఉండి హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టులను పూర్తిచేయకుండా వాటిని తాగునీటి ప్రాజెక్టులుగా మార్చి, శంకుస్థాపనలతోనే కాలయాపన చేశారన్నారు. వైఎస్సార్ సీఎం అయ్యాకే వాటిని సాగునీటి ప్రాజెక్టులుగా మార్చి పూర్తిచేశారని గుర్తుచేశారు. చంద్రబాబే ఆ ప్రాజెక్టులను పూర్తిచేసి ఉంటే బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం నీటి వాటాలు దక్కేవన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని వైఎస్ పెంచుతుంటే కృష్ణా బ్యారేజీపై ధర్నా చేయించిన ఘనత చంద్రబాబుదేనన్నారు.
ఇప్పుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపడుతుంటే దాన్ని వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా వారితో లేఖ రాయించారన్నారు. మరోవైపు.. రాయలసీమలో హైకోర్టు పెడతామంటే అడ్డుకుని, ఇప్పుడు హైకోర్టు బెంచ్ పెడతామని చెప్పడం దారుణమన్నారు. ఇన్ని విధాలుగా రాయలసీమకు అన్యాయం చేస్తున్న తండ్రీకొడుకులు ఏ ముఖం పెట్టుకుని ‘రాయలసీమ డిక్లరేషన్’ అంటున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజలు మూడుసార్లు అవకాశవిుస్తే కుప్పానికి నీళ్లివ్వలేని మీరు రాయలసీమకు ఏం చేస్తారని ప్రశ్నించారు.
వైఎస్ జగన్ సీఎం అయ్యాకే కుప్పంకు రెవెన్యూ డివిజన్ తెచ్చారని, మున్సిపాలిటీగా మార్చారని శ్రీకాంత్ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం ఈ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. ఉద్యోగులకు పీఆర్‌సీ ఇస్తూ, కాంట్రాక్టు కార్మికులను కూడా పర్మినెంట్ చేస్తున్నారన్నారు. కడప కొప్పర్తి పారిశ్రామిక వాడలో నాలుగేళ్లలో వెయ్యి కోట్ల కేంద్ర నిధుల్ని ఈ ప్రభుత్వం తెచ్చిందన్నారు.
బాబు బాధ్యతారాహిత్యం..
సామాన్యుడికి ఎలా మేలు చేయాలో ఆలోచించకుండా కర్ణాటకలో ఇచ్చిన హామీలను తీసుకొచ్చి మేనిఫెస్టోలో చేర్చారని శ్రీకాంత్ ఎద్దేవా చేశారు. అన్నిదేశాలు, రాష్ట్రాలు జనాభా నియంత్రణకు కృషిచేస్తుంటే చంద్రబాబు మాత్రం బాధ్యతారాహిత్యంగా ఎంతమందినైనా కనండి అంటూ రివర్స్‌లో చెబుతున్నారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment