పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరులో బీజేపీ అభ్యర్థి రాంచందర్‌రావు ఓటమికి అనేక కారణాలున్నాయి. ఈ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన కాషాయ పార్టీకి ఉమ్మడి మహబూబ్‌నగర్ ఓట్లే దెబ్బతీశాయని తెలుస్తోంది. మూడు ఉమ్మడి జిల్లాలతో పోలిస్తే ఆ పార్టీ అభ్యర్థికి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఎక్కువ ఓట్లు వచ్చాయని.. మహబూబ్‌నగర్‌లో మాత్రం ఆశించిన మేరకు రాబట్టలేకపోయారనే ప్రచారం జరుగుతోంది.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పునరావృతం అవుతాయని భావించిన బీజేపీకి పట్టభద్రులు ఊహించని విధంగా షాక్ ఇచ్చారు. నిరుద్యోగం, పీఆర్‌సీని ప్రధాన ఎజెండాగా చేసుకున్న ఆ పార్టీ నేతలు వాటినే ప్రధాన అంశాలు చేసుకుని ప్రచారం నిర్వహించారు. అంతే తప్పా తమ వైపున ఉన్న తప్పులను సరిదిద్దుకునే పని చేయలేదనే ఆవేదన బీజేపీ శ్రేణుల్లో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఈ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడం పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు. దీంతో ఎన్నికల ఫలితాలపై పోస్టుమార్టం ప్రారంభించారు. ఇందులో ప్రధానంగా ఐదు అంశాలు టీఆర్‌ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి గెలుపునకు కలిసివచ్చాయని గుర్తించారు.
అన్నింటి కంటే ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నమోదైన పోలింగ్ శాతం ఆమెకు కలిసొచ్చింది. ఈ సరళిని పరిశీలిస్తే హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల కంటే పూర్వ పాలమూరులో పోలింగ్ శాతం భారీగా నమోదైంది. 2015లో 55శాతం పోలింగ్ జరిగితే ఈసారి ఏకంగా 78.47శాతం ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ శాతం పెంపునకు అధికారుల అవగాహనతో పాటు టీఆర్‌ఎస్ కారణమని చెప్పవచ్చు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు క్షేత్రస్థాయి కార్యకర్తలూ ఓటరు నమోదు ప్రక్రియలో చురుగ్గా పాల్గొన్నారు. ఆయా గ్రామాలు, పట్టణాల్లో పట్టభద్రులను గుర్తించి వారికి ఓటు కోసం దరఖాస్తు చేశారు. అంతటితో ఆగకుండా వారితో నిరంతరం టచ్‌లో ఉంటూ పోలింగ్ రోజున వారిని వెంట తీసుకెళ్లి వేయించడంలో కీలకంగా వ్యవహరించారు.
పెరిగిన ధరల ప్రభావం
ఇక బీజేపీ నేతలు మాత్రం పట్టభద్రుల ఓట్ల నమోదు ప్రక్రియ, వారితో ఓటు వేయించేలా చర్యలేవీ తీసుకోలేపోయారు. రాష్ట్రంతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు స్థానిక సంస్థల్లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థులే ప్రజాప్రతినిధులుగా ఉండటం బీజేపీకి ప్రతికూలంగా మారింది. మరోవైపు 2015లో ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత రాంచందర్‌రావు ఉమ్మడి జిల్లాలో అంతగా పర్యటించలేదనే అపవాదు ఉంది. ఇదీ ఈ ఎన్నికల్లో కాస్తా ప్రభావం చూపిందని చెప్పవచ్చు. ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపాయి. పెరిగిన ధరలతో పట్టభద్రులు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని వద్దనుకున్నారు.
ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించినట్టు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే పీఆర్‌సీ వరిస్తుందని ఉద్యోగులు నమ్మి ఆ పార్టీ అభ్యర్థి వాణీదేవికే ఓటేశారు. అన్నిటికంటే మించి ఉమ్మడి జిల్లాలో కాషాయ నేతల్లో కొరవడిన సమన్వయం, వర్గ విభేదాలూ రాంచందర్‌రావు ఓటమికి కారణాలే. ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు సీనియర్లు అభ్యర్థి తరపున ప్రచారం విషయంలో అంటీముట్టినట్టుగా వ్యవహరించారనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కొన్నాళ్ల నుంచి ఉమ్మడి జిల్లాలో సీనియర్, జూనియర్ నేతల మధ్య కొనసాగుతున్న విభేదాలు ఇటీవలే బట్టబయలయ్యాయి. దీంతో బీజేపీ క్యాడర్ సైతం ఊహించినంత ప్రచారం చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment