కొడంగల్: ఈ ఎన్నికలు కేసీఆర్‌కు, కొడంగల్ ప్రజల ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్, కేటీఆర్‌ను బంగాళాఖాతంలో కలిపేలా తీర్పు ఇవ్వాలని కోరారు. సోమవారం పెద్దసంఖ్యలో కార్యకర్తలు, అభిమానులతో తరలివెళ్లిన రేవంత్, కొడంగల్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేశారు. మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, పీసీసీ సభ్యుడు మహ్మద్ యూసుఫ్‌తో కలసి రిటర్నింగ్ అధికారి లింగ్యానాయక్‌కు నామినేషన్ పత్రాలు అందజేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి తనది మాత్ర మే కాదని, కొడంగల్‌లోని ప్రతి బిడ్డా తనను తాను పీసీసీ అధ్యక్షుడిగా భావించాలని పిలుపునిచ్చారు. మీ ఆశీర్వాదంతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని, కొడంగల్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ ప్రాంతం పేరు నిలబెట్టానని అన్నారు.
సోనియా మనకు మంచి అవకాశాలు ఇస్తున్నారని, ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే గొప్ప అవకాశం కొడంగల్ ప్రజలకు వచ్చిందని చెప్పారు. భవిష్యత్తులోనూ మంచి అవకాశాలు రావచ్చు అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చే బాధ్యత మీదేనని అన్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు వచ్చిన మెజార్టీకన్నా ఎక్కువ మెజార్టీ అందించి చూపించాలని కోరారు.
రెండేళ్లలో దశ, దిశ మారుస్తాం
రాష్ట్రంలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌ల మాదిరిగా కొడంగల్‌ను ఎందుకు అభివృద్ధి చేయలేదని కేసీఆర్‌ను రేవంత్ నిలదీశారు. దత్తత కాదు.. ధైర్యం ఉంటే కొడంగల్‌లో పోటీ చేయాలని సవాల్ విసిరినా స్వీకరించలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రెండేళ్లలో రాష్ట్రం దశ, దిశ మారుతుందని చెప్పారు. హెలీకాప్టర్ ద్వారా కొడంగల్‌కు చేరుకున్న ఆయన ముందుగా గాడిబాయి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన నివాసంలో సర్వమత ప్రార్థనలు చేశారు.
కేసుల్లేవు..ఎఫ్‌ఐఆర్‌లున్నాయి
రిటర్నింగ్ అధికారికి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో రేవంత్‌రెడ్డి తన ఆస్తులు అప్పులతో పాటు తనపై ఉన్న కేసుల వివరాలను వెల్లడించారు. క్రిమినల్ కేసులు లేవని, రాష్ట్రంలోని పలు పీఎస్‌లలో తనపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని పేర్కొన్నారు. 2022– 23 ఆర్థిక సంవత్సరానికి తన ఆదాయం రూ.13,76,700, తన సతీమణి గీతారెడ్డి ఆదాయం రూ.11,13,490 అని తెలిపారు.
వ్యవసాయం ద్వారా రూ.3,15,000 ఆదాయం వస్తుందని వివరించారు. సెక్రటేరియేట్ బ్రాంచ్‌లో రూ.3,08,954 డిపాజిట్, ఢిల్లీ పార్లమెంట్ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో రూ.17,17,461 డిపాజిట్ ఉన్నట్లు తెలిపారు. హోండా సిటీ కారు, మెర్సిడెస్ బెంజ్ కారు, 1,235 గ్రాముల బంగారం, 9,700 గ్రాముల వెండి ఉన్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment