సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కుట్రలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ను ధైర్యంగా ఎదుర్కొనలేక ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో మహిళల కోసం ఎందుకు ధర్నా చేయడం లేదని బీజేపీ నేతలు ప్రశ్నించారని.. తెలంగాణలో మహిళలకు ఉన్న పథకాలు దేశంలో ఎక్కడా అమలు చేయడం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో 50శాతం మహిళలకు రిజర్వేషన్‌లకు అవకాశం కల్పించారని తెలిపారు.
‘మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడిన ప్రభుత్వం మాది. మీరు దేశంలో మహిళ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారు. దేశంలో మోడి ఆడింది ఆట, పాడిందే పాట లాగా అయిపోయింది. దేశంలో కేసీఆర్‌కు వస్తున్న ప్రజాదరణను అడ్డుకోవడానికి కేంద్రం కుట్ర పన్నింది. బీజేపీలో మహిళలకు సరైన ఆదరణ, ప్రాధాన్యత లేదు.’ అని సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు.
బండిపై సత్యవతి రాథోడ్ ఫైర్
ఈడీలు, బోడీలు మమ్మల్ని ఏమీ చేయలేవని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. 2018లో తెలంగాణ బీజేపీ 100 పైగా నియోజక వర్గాల్లో డిపాజిట్‌లు కూడా రాలేదని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఆయన ఒళ్లు దగ్గర పెట్టుకుని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.
బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను బట్టి ఆయనకు మహిళలంటే ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చని సెటైర్లు వేశారు. బీజేపీ నేతలు భవిష్యత్తులో జైళుకు వెళ్లే రోజులు వస్తాయని జోస్యం చెప్పారు. తలకిందులుగా తపస్సు చేసినా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదని అన్నారు. బండి సంజయ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
బండి వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసై స్పందించాలని మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చీమ చిటుక్కుమంటే స్పందించే గవర్నర్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. గవర్నర్ ఉద్ధేశం ఏంటో చెప్పాలని అన్నారు.
మోదీని వ్యతిరేకిస్తేనే నోటీసులు
బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈడీ విచారణలో ఎమ్మెల్సీ కవిత ఏ తప్పు చేయలేదని తేలుతందని పేర్కొన్నారు. ప్రధాని మోదీకి జై కొడితే ఏ నోటీసులు ఉండవని.. వ్యతిరేకిస్తే నోటీసులు ఉంటాయని విమర్శించారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలు దారుణమని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్ వ్యాఖ్యలపై స్పందించే ధైర్యం గవర్నర్‌కు ఉందా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ అధ్యక్షుడి హోదాలో బండి సంజయ్ వ్యాఖ్యలు కుసంస్కారమని ప్రభుత్వం విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. బండి వ్యాఖ్యల వీడియోను గవర్నర్‌కు ట్యాగ్ చేశారు.
హైదరాబాద్‌లో నిరసనలు
హైదరాబాద్ ఈడీ కార్యాలయం ముందు బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. బండి సంజయ్ చేసిన వాఖ్యలను నిరసిస్తూ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈడీ ఆఫీస్‌ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో స్థానికంగా పోలీసులు భారీగా మోహరించారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈడీ కార్యాలయం గేట్లు మూసివేశారు పోలీసులు. అదే విధంగా పంజాగుట్టలో బండి సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రెడ్డి నిరసన చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment