సాక్షి, అమరావతి: స్కిల్ స్కాంలో ప్రభుత్వ ఖజానా నుంచి రూ.371 కోట్లు దోచేసి, ఆధారాలతో సహా పట్టుబడినా.. ఇప్పటికీ తాను తప్పేమీ చేయలేదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బుకాయిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.ఆర్థిక శాఖ అప్పటి ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ స్టేట్‌మెంట్ ఆధారంగా చంద్రబాబుపై కేసు పెట్టారనడం అవాస్తవమంటూ కొట్టిపారేశారు.కేసు కోర్టు పరిధిలో ఉండగా ఆయన మాట్లాడటం సరికాదన్నారు.
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో సజ్జల మాట్లాడుతూ.. స్కిల్ స్కాంపై సీఐడీ దర్యాప్తులో భాగంగా చంద్రబాబును అరెస్టు చేశారన్నారు. రాజకీయంగా కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసులో తనను అరెస్టు చేశారంటూ చంద్రబాబు తప్పించుకోవాలని చూస్తున్నారని చెప్పారు.
అమరావతి భూకుంభకోణం, అసైన్డ్ భూకుంభకోణం, టిడ్కో ఇళ్ల స్కాం, ఇన్నర్ రింగ్ రోడ్డు, స్కిల్ డెవలప్‌మెంట్, ఫైబర్‌నెట్ స్కాం కేసులు రాత్రికి రాత్రే పుట్టుకొచ్చినవి కావని.. రెండేళ్లుగా వాటిపై విచారణ సాగుతోందని స్పష్టంచేశారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఈ కుంభకోణాలను ప్రస్తావించామని.. అధికారంలోకి వచ్చాక వాటిపై విచారణ చేస్తున్నామని, ఇందులో ఎలాంటి కక్ష సాధింపు లేదంటూ సజ్జల స్పష్టంచేశారు. ఈ కేసులకు సంబంధించి బలమైన ఆధారాలు ఉన్నప్పుడు చట్టప్రకారం దర్యాప్తు సంస్థలు తమ పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నాయని వివరించారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే..
- కేసుల దర్యాప్తులో సీఐడీకి సరైన ఆధారాలు లభిస్తే.. చంద్రబాబునైన, లోకేశ్‌నైన, అచ్చెన్నాయుడునైనా విచారణకు పిలుస్తారు. కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లు విని ఉంటే జగన్‌పై కేసులు ఉండేవే కాదు. కానీ, కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు కుమ్మక్కై కేసులు పెట్టి, కక్ష సాధింపులకు గురిచేసిందనే విషయం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ భావించబట్టే జగన్‌ను ప్రజలు అక్కున చేర్చుకున్నారు.
- ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో కూడా చంద్రబాబు పాత్ర ఉంది. ఇప్పటికే చంద్రబాబు రిమాండ్‌లో ఉన్నారు కాబట్టి ఆ కేసులో విచారణకు పీటీ వారెంట్ వేసి ఉంటారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తనపై ఎలాంటి కేసుల్లేవని చంద్రబాబు చెప్పుకోవడం పూర్తి అబద్ధం.
- అనేక కేసుల్లో విచారణను ఎదుర్కోకుండా వ్యవస్థలను మేనేజ్ చేసి స్టేలు తెచ్చుకుంటూ ఇంతకాలం తప్పించుకుంటూ వస్తున్నారు. ఏ కేసులో కూడా క్లీన్‌చిట్ తెచ్చుకోలేదు. గతంలో చంద్రబాబుపై దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా కేసులు పెట్టారు. కానీ.. రాజకీయంగా తేల్చుకుందామని వాటిని వదిలేశారు.
- ఇక వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని లోకేశ్‌ను చూసి సీఎం జగన్ భయపడాలా? చంద్రబాబు జైలులో ఉంటే తప్పితే ఎన్నికలను ఎదుర్కోలేం అనే భావనలో సీఎం జగన్ లేరు. ఊతకర్రలు లేనిదే ఎన్నికలకు వెళ్లలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారు.
- చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చినప్పుడు పవన్ కనబడలేదు. ఆయనకు అవసరమైనప్పుడు రాష్ట్రానికి వచ్చి మాట్లాడి తిరిగి వెళ్తున్నాడు. ఆ క్రమంలోనే ఇప్పుడొచ్చి పవన్ హడావుడి చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment