
సాక్షి, అమరావతి: దుష్టశక్తి లాంటి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నయవంచక క్రీడలో బీజేపీ పావుగా మారడం జాలి కలిగిస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. విజయవాడలో బీజేపీ నిర్వహించిన ప్రజాగ్రహ సభ టీడీపీ అనుబంధ విభాగం కార్యక్రమాన్ని తలపించిందని ఎద్దేవా చేశారు. తటస్థుల ముసుగులో చలసాని శ్రీనివాస్, గరుడ పురాణం శివాజీ లాంటి ఐదారుగురిని తయారు చేసుకున్న చంద్రబాబు ఇప్పుడు సీపీఐ, జనసేన, కాంగ్రెస్, బీజేపీతో తోలు బొమ్మలాట ఆడిస్తున్నారని మండిపడ్డారు. మాటకు కట్టుబడి జనరంజక పాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్‌ను సార్వత్రిక ఎన్నికల కంటే 15 శాతం అధికంగా ఓట్లతో ప్రజలు స్థానిక ఎన్నికల్లో ఆశీర్వదించారని చెప్పారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
బీజేపీపై ఆ ఇద్దరు ఎంపీల పెత్తనం..
చంద్రబాబు చీకటి సామ్రాజ్యానికి ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేష్ దళపతులు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బీజేపీ పంచన చేరి టీడీపీని కాపాడుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించారు. ఆ క్రమంలోనే సుజనా చౌదరిని ప్రధాని మోదీ వద్దకు రాయబారానికి పంపారు. చంద్రబాబు ఎంత ప్రమాదకరమైన వ్యక్తో తెలిసిన ప్రధాని మోదీ ఆయన్ను మినహా మిగతావారిని బీజేపీలో చేర్చుకోవడానికి సిద్ధమని చెప్పారట. సుజనా చౌదరి, సీఎం రమేష్‌లను బీజేపీలోకి పంపి మిగతా వారంతా త్వరలోనే వస్తారంటూ చంద్రబాబు పబ్బం గడుపుతున్నారు. మరోవైపు జనసేన, సీపీఐ, కాంగ్రెస్‌లతోనూ అంటకాగుతూ 2024లో పొత్తు పెట్టుకుని పోటీ చేయాలని పథకం వేశారు. టీడీపీ నుంచి వెళ్లిన ఆ ఇద్దరు ఎంపీలు బీజేపీపై పెత్తనం చేయడం ఏమిటి?
రూ.50కే చీప్ లిక్కర్ మీ విధానమా?
సోము వీర్రాజు ప్రసంగం స్క్రిప్ట్ అంతా టీడీపీ కార్యాలయంలోనే తయారైంది. బీజేపీ అధికారంలోకి వస్తే నాణ్యమైన చీప్ లిక్కర్ రూ.50కే అందిస్తామని సోము వీర్రాజు హామీ ఇవ్వడం ఆ పార్టీ దిగజారుడుతనానికి పరాకాష్ట. తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్కొన్నట్లుగా ఇదే బీజేపీ జాతీయ విధానమా? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రూ.50కే చీప్ లిక్కర్ అందిస్తారా?
బీజేపీతో అంటకాగి హోదాకు సమాధి
బీజేపీతో అంటకాగి రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అధికారాన్ని పంచుకున్న చంద్రబాబు ప్యాకేజీ ముద్దు అంటూ ప్రత్యేక హోదాకు సమాధి కట్టారు. చంద్రబాబు ప్యాకేజీని కోరినందున ప్రత్యేక హోదాపై తమ బాధ్యత లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. బీజేపీ మిత్రపక్షమైన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాత్రం ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ ఎందుకు పోరాడదని ప్రశ్నిస్తున్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తున్న బీజేపీ నేతలే దానికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ పోరాడాలంటున్నారు. ఇదెక్కడి చోద్యం. అధికారంలో ఉండగా పేదల ఇళ్ల రుణంపై వడ్డీ మాఫీ చేసేందుకు కూడా నిరాకరించిన చంద్రబాబు ఇప్పుడు ఓటీఎస్ పథకంపై దుష్ఫ్రచారం చేస్తున్నారు. రాజధాని, ఇంగ్లిషు మీడియం, సినిమా టికెట్లు, ఉద్యోగ సంఘాలతో చర్చల వరకూ అన్ని అంశాల్లోనూ ఇదే రీతిలో చంద్రబాబు బురద చల్లుతున్నారు. కేంద్రం దయాదాక్షిణ్యాలతో రాష్ట్రాలు బతుకుతున్నాయని బీజేపీ నేతలు మాట్లాడటం దారుణం. కేంద్రం అమలు చేసే పథకాలకు ఎక్కడా ప్రధాని, ఇతర నేతల పేర్లను తొలగించడం లేదు.
బీజేపీకి విశాఖ కావాలా.. వద్దా?
విశాఖపట్నం కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని కావాలా? వద్దా? అన్నది తేల్చి చెప్పాకే ఉత్తరాంధ్రలో బీజేపీ ఉద్యమం చేయాలి. అమరావతిని కుంభకోణాల రాజధానిగా అభివర్ణించింది బీజేపీ నేతలే. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది కూడా వారే. ఓ 400 మంది చందాలు వసూలు చేసి నిర్వహిస్తున్న అమరావతి ఆందోళనకు అలాంటి బీజేపీ మద్దతివ్వడం శోచనీయం.
చంద్రబాబైతే రాధాకు భద్రత కల్పించేవారా?
తనను చంపడానికి రెక్కీ నిర్వహించారని ఇటీవల ఒక సభలో వంగవీటి రాధా అనుమానం వ్యక్తం చేశారు. ఆ సభలోనే ఉన్న మంత్రి కొడాలి నాని ఈ అంశాన్ని సీఎం వైఎస్ జగన్‌కు తెలియజేయడంతో 2+2 భద్రత కల్పించాలని ఆదేశించారు. దీనిపై సమగ్రంగా విచారించి నివేదిక ఇవ్వాలని పోలీసు శాఖను ఆదేశించారు. అయితే తనకు భద్రత వద్దని వంగవీటి రాధా చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉంటే రాధాకు ఈ స్థాయిలో భద్రత కల్పించేవారా? బాధ్యతగా వ్యవహరించిన రాష్ట్ర
ప్రభుత్వంపై చంద్రబాబు డీజీపీకి లేఖ రాయడం ఆశ్చర్యకరం.
చదవండి: నాడు ‘పార్టీలేదు బొక్కాలేదు’.. నేడు చంద్రబాబు గుట్టు రట్టు చేసిన అచ్చెన్న
Comments
Please login to add a commentAdd a comment