
పదేళ్ల క్రితం ఒకే వేదికను పంచుకున్నారుగా.. నాటి హామీలు ఏమయ్యాయి?
కనీసం సంజాయిషీ చెప్పి ప్రజల ముందుకు రావాల్సింది
పదేళ్ల తర్వాత మళ్లీ అదే నాటకం ఆడితే ప్రజలేమన్నా అజ్ఞానులా?
నాడు బూతులు తిట్టుకుని మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఒకే వేదిక ఎక్కారు?
వారేం చెప్పినా ప్రజలు నమ్మరనే సీఎం జగన్‌పై తిట్లతో బాబు, పవన్ ప్రసంగాలు
మోదీ వద్ద హోదా, పోలవరం, విశాఖ ఉక్కు వంటి సమస్యలను ప్రస్తావించలేదేం?
సభ అట్టర్ ఫెయిల్ అయ్యిందని ప్రధాని తిట్టి ఉంటారు
అందుకే ఆ నెపం పోలీసులపైకి నెడుతున్నారు
వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి: చిలకలూరిపేట సభను నిర్వహించుకోలేక అభాసుపాలై పోలీసులపై నిందలేస్తే ఎలా అని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలను వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. కూటమి నేతల తీరు ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా ఉందన్నారు. సభ అట్టర్ ఫెయిల్ కావడంతో ప్రధాని మోదీ తిట్టి ఉంటారని, దీంతో చంద్రబాబు, పవన్ పోలీసులపై నెపం వేస్తున్నారని అన్నారు.
ఆయన సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్ర విభజన నేపథ్యంలో పదేళ్ల క్రితం 2014లో జరిగిన ఎన్నికల్లో వీరు ముగ్గురూ తిరుపతిలో ఒకే వేదికపై కనిపించారు. కొత్త రాష్ట్రం, కొత్త సమస్యల పరిష్కారానికి జాతీయ స్థాయి నాయకత్వం కావాలని అప్పట్లో చంద్రబాబు అన్నారు. దీనికి సరైన పరిష్కారం చూపుతామంటూ పవన్‌ను తోడుగా తీసుకుని తిరుపతి సభలో మోదీ ప్రత్యక్షమయ్యారు. మళ్లీ పదేళ్ల తర్వాత అదే నాటకమాడుతున్నారు. ఆనాడు కొత్త పెళ్లి కాబట్టి కాస్తంత ఊపు మీద ఉన్నట్లు కన్పించారు. ఇప్పుడు మాత్రం ప్రజల్ని మోసగిస్తున్న ఛాయలు వారి ముఖాల్లో కనిపించాయి’
అని అన్నారు. మీడియాతో మాట్లాడుతూ సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏమన్నారంటే..
అప్పట్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?
2014లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసినా కేవలం 1 శాతం ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చారు. నాడు వారు ఇచ్చిన ప్రత్యేక హోదాతో సహా మిగతా హామీలన్నీ ఏమయ్యాయి? మూడేళ్ల తర్వాత విడిపోయి బండ బూతులు తిట్టుకున్నారు. చంద్రబాబు ఏకంగా మోదీ కుటుంబాన్ని గురించి కూడా మాట్లాడారు. ఈరోజు అదే చంద్రబాబు అవే పార్టీలను కలుపుకొని వేదిక ఎక్కారు. మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఇప్పుడు ఒకే వేదికపైకి వచ్చారు? 2014లో రైతు రుణ మాఫీ, డ్వాక్రా రుణ మాఫీ, ఆడబిడ్డ పుట్టగానే 25 వేలు వేస్తామని, జాబు కావాలంటే బాబు రావాలి – లేదంటే నెలకు రూ.2000 నిరుద్యోగ భృతి.. ఇలా 600కు పైగా హామీలు ఇచ్చారు. అవన్నీ ఎమయ్యాయో చిలకలూరిపేటలో సంజాయిషీ ఇచ్చి ఉండాల్సింది. ఇప్పుడేం చెప్పినా ప్రజలు నమ్మరనే సీఎం జగన్‌పై దుమ్మెత్తిపోయడమే పనిగా చంద్రబాబు, పవన్ నోటికొచ్చినట్లు మాట్లాడారు.
చిన్న సభనూ సక్రమంగా నిర్వహించలేకపోయారు
సాక్షాత్తు ప్రధాని మోదీ పాల్గొన్న సభ గందరగోళంగా జరిగింది. వాళ్ల మైక్ సిస్టమ్స్ ఫెయిల్ అయితే పోలీసులు రాలేదని ఆరోపిస్తున్నారు. లక్షల మంది వచ్చే మా సిద్ధం సభలకు మా ఏర్పాట్లు మేం చేసుకున్నాం. అలానే ఎవరి ఏర్పాట్లు వారు చేసుకోవాలి. పొరపాటున కరెంటు పోయి ఉంటే మాపైనే ఎన్నో అనేవారు. ఒక చిన్న సభ.. అంతా కలిపి 50 – 60 వేలు వచ్చి ఉంటారు. అదీ సక్రమంగా నిర్వహించలేక, వారి చేతకాని తనాన్ని పోలీసు శాఖకు అంటగట్టడం దివాళాకోరుతనం. ప్రధాని మోదీకి సన్మానం అన్నారు.. అవమానించారు. ఇవన్నీ అర్జంటుగా అధికారంలోకి వచ్చేయాలన్న చంద్రబాబు ఆత్రాన్ని సూచిస్తాయి. జగన్ చెల్లెళ్లే ఓట్లేయద్దంటున్నారు అని చంద్రబాబు అంటే.. వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్ రెండు ఒకటేనని ప్రధాని మోదీ చెబుతున్నారు. మీరు ఏది చెబితే అది నమ్మడానికి ప్రజలంత అజ్ఞానులు అనుకుంటున్నారా?
సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లి ప్రధానితో సమావేశమైన ప్రతిసారీ ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు, రైల్వే జోన్, విభజన హామీలతోపాటు విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే నడపాలని కోరుతూ వస్తున్నారు. ప్రధాని మోదీ పాల్గొన్న వేదిక నుంచే ఈ హామీలు అమలు చేయాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. చిలకలూరిపేట సభలో ప్రత్యేక హోదా, పోలవరం, స్టీల్‌ప్లాంట్‌పై ప్రధాని మోదీని చంద్రబాబు, పవన్ కనీసం అడగలేకపోయారు.
విశ్వసనీయతకు వారంటీ అవసరం లేని గ్యారంటీ జగన్
తాము పెట్టుకున్న నమ్మకానికి డబుల్‌గా జగన్ చేశారనే నమ్మకం ప్రజల్లో ఉంది. ప్రజల్లో ఆ స్పందన కనిపిస్తోంది. సిద్ధం సభల్లో కనిపించిన స్పందన అక్కడి నుంచి వచ్చిందే. విశ్వసనీయతకు వారంటీ అవసరం లేని గ్యారంటీ సీఎం వైఎస్ జగన్ అనేది ఈ ఐదేళ్లలో కనిపించింది. చంద్రబాబు, పవన్ ఎన్ని చెప్పినా రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలు జగన్ పాలన వల్ల లబ్ధి పొందాయి. ఇది తాత్కాలికం కాదు. వారి జీవితాల్లో వెలుగులు వచ్చాయి. అందుకే ప్రజలు జగన్‌ను వారి మనిషిగా ఓన్ చేసుకుంటున్నారు. చంద్రబాబు 2014లో వేసిన నాటకం మళ్లీ వేసి ప్రజలను భ్రమల్లో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, వాటిని తిప్పికొట్టాలి.
Comments
Please login to add a commentAdd a comment