సాక్షి, తాడేపల్లి: ప్రజల్లోకి వెళ్లి ఓటు వేయమని అడిగే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. అధికారంలోకి రారని తెలిసి ఎన్ని ఛాలెంజ్‌లు అయినా చేస్తారని మండిపడ్డారు.
ఆయన సోమవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడ్డారు. ప్రజల కోసం ఏం చేశారని చంద్రబాబు ఓటు అడుగుతాని ప్రశ్నించారు. తాము నాలుగున్నరేళ్లుగా అందించిన సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయమని అడుతున్నామని సజ్జల తెలిపారు. సీఎం జగన్‌ను తిట్టడం తప్పిస్తే చంద్రబాబు ఏదైనా మాట్లాడుతున్నారా? అని మండిపడ్డారు. తన పాలనలో ఇది చేశాం అని చెప్పుకునేందుకు చంద్రబాబుకు ఏదైనా ఉందా? అని సూటిగా ప్రశ్నించారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏం చేశారు? అని అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తాము అమలు చేశామని సజ్జల చెప్పారు.
చంద్రబాబు ఎల్లో మీడియాతో కలిసి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. గోబెల్స్ ప్రచారం చేసి చర్చకు రమ్మంటే రావాలా? అని ఫైర్ అయ్యారు. అంతిమంగా నిర్ణయించేది ప్రజలేనని అన్నారు. మీడియాలో ఊసుపోని కబుర్లతో చంద్రబాబు కాలక్షేపం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు పగటి కలలు కంటున్నారని మండిపడ్డారు. తాము మంచి చేశామని నమ్మితే ఓటు వేయమని ప్రజలను అడుగుతున్నామని తెలిపారు. చంద్రబాబు సభలు ఎందుకో ఎవరికీ తెలీదని సజ్జల ఎద్దేవా చేశారు.
సిద్ధం సభలకు జనస్పందన చూస్తే సీఎం జగన్‌పై ఉన్న ప్రజాదారణ అర్థమవుతుందని తెలిపారు. ఏం చూసి చంద్రబాబుకు ఓటు వేయాలి? అని ప్రశ్నించారు. మరో 50 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయని తెలిపారు. రూ.2.55 లక్షల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయింది వాస్తవం కాదా? అని నిలదీశారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు వాస్తవం కాదా? అని అన్నారు. చంద్రబాబు సవాల్‌కు తాము సిద్ధమేనని అన్నారు.
చదవండి: బాబు.. వీటికి బదులేది? (పార్ట్-1)
‘గత ఐదేళ్లలో ఏ అభివృద్ధీ చేయని చంద్రబాబు ఇప్పుడు మాకు సవాల్ చేయటం కరెక్టు కాదు. చంద్రబాబుకు సత్తా ఉంటే గతంలో ఏం చేశారో చెప్పాలి. చంద్రబాబు పాలన చెత్తపాలన అని పవన్ కళ్యాణ్ స్వయంగా అన్నారు . మద్యం విషయంలో దశలవారీగా చేస్తున్నాం చంద్రబాబు సవాల్‌కు మేము సిద్దమే. మా తరపున ఎవరో ఒకరు చర్చకు వస్తారు. అంతకంటే ముందు గత పాలనలో ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పాలి. సీఎం జగన్ పాలనలో చెప్పి, చేయనవి ఏంటో చంద్రబాబు చెప్పాలి. కౌంట్ డౌన్ మొదలైంది. ఇంకో యాభై రోజుల్లో ప్రజలే నిర్ణయిస్తారు.
... మా వాలంటీర్ల వ్యవస్థ మంచిది కాదు, మళ్ళీ జన్మభూమి కమిటీలు తెస్తానని డైరెక్ట్ గా చెప్పాలి. సిద్ధం సభలను ప్రజలు చూస్తూనే ఉన్నారు . ఏ సభలోనూ సీఎం జగన్ పరుషంగా ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మాటలు ఎలా ఉన్నాయో కూడా జనం చూస్తున్నారు. ఊరూరా జరిగిన అభివృద్ధిని ఎవరూ కాదనలేదు. ఎల్లోమీడియా రోజూ తప్పుడు వార్తలు రాస్తున్నారు. చేసిన అభివృద్ధి, సంక్షేమం వారికి కనపడదా? . 87% మంది ప్రజలు నేరుగా ప్రభుత్వ లబ్ది పొందారు. ఆ కృతజ్ఞతలు చూపిస్తున్నారు. సీఎం జగన్ మీద వ్యతిరేకత ఉంటే మరి చంద్రబాబుకు పొత్తులు ఎందుకు?.
... రెండు ఎకరాల నుండి లక్షల కోట్ల ఆస్థులు చంద్రబాబు ఎలా సంపాదించారు?. సీఎం జగన్ ఆస్థులు ప్రజలకు పంచాలన్న లోకేష్ ప్రకటన హాస్యాస్పదం. చేతిలో పచ్చ మీడియా ఉన్నందున ఏది మాట్లాడినా వార్తలు వేస్తారని చంద్రబాబు, లోకేష్ అనుకుంటున్నారు. చంద్రబాబు నిజం చెప్తే తల వెయ్యి ముక్కలు అవుతుందని ముని శాపం ఉందని గతంలో వైఎస్సార్ అనేవారు. ఆ సంగతి తెలీక లోకేష్ ఆ సామెతని సీఎం జగన్‌కు చుడుతున్నాడు. జైల్లో ఉన్నప్పుడు సర్వరోగాలు ఉన్నాయని చెప్పుకుని బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆ రోగాలన్నీ ఇప్పుడు ఏం అయ్యాయో చంద్రబాబు చెప్పాలి. కేసులపై కోర్టులు తీర్పులు ఇస్తాయి. త్వరలోనే మేనిఫెస్టోని ప్రకటిస్తాం. చేయగలిగినదే చెప్తాం. చేయలేనివి ఎందుకు చేయలేక పోయామో కూడా చెప్తాం’ అని సజ్జల అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment