వైఎస్సార్ సీపీ నేత ఉదయభాను హెచ్చరిక
మా సహనాన్ని పరీక్షించొద్దు
జగ్గయ్యపేట అర్బన్: ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి అరాచకం సృష్టిస్తూ రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు తెగబడుతున్న టీడీపీ మూకలు తమ సహనాన్ని పరీక్షించవద్దని ప్రభుత్వ మాజీ విప్, వైఎస్సార్ సీపీ నేత సామినేని ఉదయభాను హెచ్చరించారు. హద్దులు దాటొద్దని, తమ సహనం నశిస్తే ప్రతిచర్యలు తప్పవని స్పష్టం చేశారు.
వారం రోజులుగా విజయోత్సవాల పేరుతో దాడులకు తెగ బడి వైఎస్సార్ సీపీ కార్యకర్తలను హింసించడం, ఇళ్లలోకి చొరబడి విలువైన వస్తువులను ధ్వంసం చేసి పైశాచిక ఆనందాన్ని పొందటాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది తాలిబాన్ల పాలనను తలపిస్తోందన్నారు. సోమవారం జగ్గయ్యపేటలో నేతలతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాతీర్పును శిరసావహిస్తున్నామని, జగ్గయ్యపేటలో గెలిచిన శ్రీరాం తాతయ్య నియోజకవర్గ ప్రజలకు మంచి చేయాలని తాము కోరుతున్నట్లు చెప్పారు.
ఇందుకేనా గెలిపించింది?
తాను ఐదు పర్యాయాలు ఎన్నికల్లో పోటీ చేశానని, గెలిచిన పార్టీ ఇలా దౌర్జన్యాలకు పాల్పడటం ఎప్పడూ చూడలేదన్నారు. 2019లో 151 సీట్లు గెలుచుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ ఎక్కడా దాడులకు దిగలేదన్నారు. కౌంటింగ్ జరుగుతుండగానే సచివాలయాల మీద టీడీపీ జెండాలు ఎగురవేయడం, విగ్రహాలను కూల్చడం, వైఎస్సార్ సీపీ జెండా దిమ్మెలు, శిలాఫలకాలను ధ్వంసం చేయడం టీడీపీ గూండాయిజానికి నిదర్శనమని ఉదయభాను మండిపడ్డారు. ఇందుకేనా చంద్రబాబును గెలిపించింది? అని ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు.
దాడులు.. ఇళ్ల లూటీ
తొర్రగుంటపాలెంలో వైఎస్సార్ సీపీ కార్యకర్త పాటి సాంబ ఇంటిపై అల్లరి మూకలు అర్ధరాత్రి దాడి చేసి విలువైన వస్తువులను ధ్వంసం చేయడంతో పాటు బీరువాలోని నగదు, బంగారాన్ని దోచుకున్నాయని ఉదయభాను పేర్కొన్నారు. మైనార్టీ మహిళపై కారం చల్లడంతోపాటు గోపి అనే వ్యక్తిపై దాడి చేశారని చెప్పారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆకుల శ్రీకాంత్, తన్నీరు నాగేంద్ర, కొండ తదితరుల నివాసాలపై రాళ్లతో దాడి చేశారని ఫొటోలను ప్రదర్శించారు.
13వ వార్డులో అభివృద్ధి శిలాఫలకాలు, జెండా దిమ్మెలను టీడీపీ మూకలు నేల కూల్చాయన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే నిందితులకు 41 ఏ నోటీసు ఇచ్చి స్టేషన్ బెయిల్‌తో సరిపుచ్చడంతో తిరిగి దాడులకు తెగబడుతున్నట్లు చెప్పారు. పారీ్టకి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తలు ఎవరూ ఆత్మ విశ్వాసాన్ని కోల్పోవద్దని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment