ఢిల్లీలో కాంగ్రెస్ నిరసన ర్యాలీ (ఇన్‌సెట్‌లో) ప్రసంగిస్తున్న ప్రియాంక
న్యూఢిల్లీ: ‘‘దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ప్రధాని రాజీవ్‌గాంధీ కుమారుడు రాహుల్. దేశ ఐక్యత కోసం వేలాది కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. అలాంటి వ్యక్తి దేశాన్ని ఎందుకు అవమానిస్తారు?’’ అని ఆయన సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ప్రశ్నించారు. ‘‘బీజేపీ నేతలు రాహుల్‌ను మీరు జాఫర్ అంటూ ఎగతాళి చేశారు. జాతి వ్యతిరేక శక్తి అని నిందించారు. మా తల్లిని అవమానించారు. నెహ్రూ ఇంటిపేరు ఎందుకు పెట్టుకోలేదంటూ మమ్మల్ని ఎద్దేవా చేశారు.
మా కుటుంబాన్ని, కశ్మీరీ పండిట్ల సంప్రదాయాన్ని ఆక్షేపించారు. అయినా వారిపై ఎందుకు కేసులు పెట్టలేదు? జైలు శిక్షలు విధించలేదు?’’ అని ప్రశ్నించారు. తమ కుటుంబాన్ని ఇప్పటికీ అవమానిస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘హార్వర్డ్, కేంబ్రిడ్జ్ వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదివిన రాహుల్‌ను ‘పప్పు’ అని ఎగతాళి చేస్తున్నారు. కానీ ఆయన పప్పు కాదని బీజేపీ నాయకులకు తెలిసిపోయింది. అందుకే పార్లమెంటు నుంచి బయటికి పంపించారు’’ అంటూ దుయ్యబట్టారు. రాహుల్‌పై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్ ఆదివారం దేశవ్యాప్తంగా ‘సంకల్ప్ సత్యాగ్రహ’ దీక్షలు చేపట్టింది.
ఢిల్లీలో రాజ్‌ఘాట్ వద్ద దీక్షలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితర అగ్ర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై ప్రియాంక నిప్పులు చెరిగారు. ‘‘మోదీ ఉత్త పిరికిపంద. అధికారం వెనుక దాక్కుంటున్నారు’’ అంటూ ఎద్దేవా చేశారు. అహంకారపూరిత మోదీ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం నేర్పించడం తథ్యమన్నారు. అరాచక బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. ‘‘మా కుటుంబం ధారపోసిన రక్తం దేశ ప్రజాస్వామ్యానికి ఊతమిచ్చింది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నాం’’ అని చెప్పారు. ఇకపై తాము మౌనంగా ఉండే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
‘మోదీ’లను విమర్శిస్తే నొప్పెందుకు: ఖర్గే
‘‘ఒక వ్యక్తిని కాపాడడానికి మొత్తం ప్రభుత్వం, కేబినెట్ మంత్రులు, ఎంపీలు ప్రయత్నిస్తున్నారు. అసలు అదానీ ఎవరు? ప్రభుత్వం ఆయనకు ఎందుకు అండగా ఉంటోందో చెప్పాలి’’ అని ప్రియాంక నిలదీశారు. ‘‘ప్రజల హక్కుల కోసం రాహుల్ పోరాడుతున్నారు. జోడో యాత్రలో ఆయన వెంట లక్షల మంది నడిచారు’’ అన్నారు. అక్రమాలకు పాల్పడి విదేశాలకు పరారైన నీరవ్ మోదీ, లలిత్ మోదీలను విమర్శిస్తే బీజేపీ ప్రభుత్వానికి నొప్పి ఎందుకని ఖర్గే ప్రశ్నించారు.
సత్యాగ్రహం పేరిట కాంగ్రెస్ దీక్ష చేయడం సిగ్గుచేటని బీజేపీ దుయ్యబట్టింది. దానికి ఆ అధికారమే లేదని బీజేపీ నేత సుధాంశు త్రివేది అన్నారు.
‘అనర్హత వేటు పడిన ఎంపీ’
ట్విట్టర్ ఖాతాను అప్‌డేట్ చేసిన రాహుల్
లోక్‌సభ సభ్యుడిగా తనపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో రాహుల్ ఆదివారం తన ట్విట్టర్ ఖాతాను అప్‌డేట్ చేశారు. బయోడేటాను ‘అనర్హత వేటుపడిన ఎంపీ’గా మార్చారు. తన అధికారిక వయనాడ్ ట్విట్టర్ ఖాతాలోనూ ‘డిస్‌క్వాలిఫైడ్ ఎంపీ’ అని రాశారు.
Comments
Please login to add a commentAdd a comment