వికారాబాద్, తాండూరు: సోనియా గాంధీ పుట్టిన రోజు.. తెలంగాణ ఏర్పాటును ప్రకటించిన రోజు డిసెంబర్ 9న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేపట్టిన రెండో విడత బస్సుయాత్రలో భాగంగా శనివారం తాండూరు, పరిగి, చేవెళ్లలో నిర్వహించిన రోడ్‌షోకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తాండూరులో మాట్లాడుతూ.. కర్ణాటకలో ఇచ్చిన అన్ని గ్యారంటీ ల హామీని గెలిచిన నెలలోపే అమలు చేశామని.. తెలంగాణలోనూ అదేవిధంగా ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు.
కర్ణాటకలో పథకాలు అమలు కావట్లేదని విమర్శిస్తున్న సీఎం కేసీఆర్ అక్కడ బంధువులుంటే తెలుసుకోవాలని.. లేదంటే మేమే బస్సు పెట్టి తీసుకెళ్లి మా పథకాల అమలు తీరును చూపుతామని చెప్పారు. గతంలో వైఎస్సార్ హయాంలో ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన మాదిరిగానే స్థలం ఉన్న వారికి రూ.5లక్షలతో ఇళ్లు నిర్మించి ఇస్తామని ఆయన హామీనిచ్చారు. యువతకు రూ.5లక్షలతో విద్యాభరోసా, రూ.15వేలతో రైతు భరోసా, మహిళలకు మహాలక్ష్మి స్కీంలో ప్రతీ నెల రూ.2,500 నగదు, రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ అందజేస్తామని వివరించారు.
కర్ణాటక రాష్ట్రంలో 1.10కోట్ల మందికి గృహలక్ష్మి పథకం అ మలు చేశామని.. మహిళలకు ఉచిత రవాణా సౌక ర్యం కల్పిస్తున్నామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నామని తెలంగాణలోనూ అలా నే అమలు చేసి తీరుతామని డీకే శివకుమార్ తెలిపారు. కర్ణాటకలో రైతులకు అయిదు గంటల పాటు నాణ్యమైన కరెంటును ఉచితంగా ఇస్తున్నామని డీకే చెప్పారు. రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ రుణా న్ని ప్రజలు తీర్చుకోవాలని కోరారు. తాండూరు కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్‌రెడ్డిని 25వేల మెజారిటీ తగ్గకుండా గెలిపించాలని ఆయన కోరారు.
కేసీఆర్ దోచుకున్న లక్ష కోట్లు కక్కిస్తాం
‘ఓడిపోతే ఫౌం హౌస్‌లో పడుకుంటా అని చిలక పలుకులు పలుకుతున్న సీఎం కేసీఆర్‌ను ఓడిపోయినా వదిలిపెట్టం. పదేళ్లలో దోచుకున్న లక్ష కోట్లు కక్కిస్తాం’అని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. తండ్రీకొడుకులు హైదరాబాద్ చుట్టూ పది వేల ఎకరాలు కబ్జా చేసిండ్రు.. ఆ భూమిని ప్రభుత్వం స్వాదీనం చేసుకుని వారిని జైలుకు పంపడం ఖాయ మన్నారు. బీఆర్‌ఎస్ ఓటమి.. కాంగ్రెస్ గెలుపు డిసైండ్ అయిందని అందుకే సీఎం రెస్ట్ తీసుకుంటానని ముందే చెబుతున్నాడని ఎద్దేవా చేశారు. రైతులకు ఎనిమిది గంటలకు మించి కరెంటు వస్త లేదని కేసీఆర్ చెప్పేదంతా బూటకమేనన్నారు.
రియల్ ఎస్టేట్, ఓఆర్‌ఆర్, అంతర్జాతీయ విమానా శ్రయం, మెట్రో తదితరాలన్నీ కాంగ్రెస్ హయాంలో జరిగినవేననీ గుర్తు చేశారు. కాంగ్రెస్ వండిపెడితే మీరు దొంగల్లా దోచుకుంటున్నారని విమర్శించా రు. వైఎస్సార్ ఇచ్చిన 4శాతం రిజర్వేషన్‌తో మైనార్టిలకు మేలు జరిగిందని.. బీఆర్‌ఎస్ మైనార్టిలకు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కిందని రేవంత్ విమర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ తాండూర్ అభ్యర్థి బుయ్యని మనోహర్‌రెడ్డి, మాజీ మంత్రులు గడ్డం ప్రసాద్ కుమార్, పుష్పలీల, డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
హజా కోసం ప్రసంగం ఆపిన రేవంత్
రేవంత్‌రెడ్డి మైనార్టిల సంక్షేమంపై మాట్లాడుతున్న సమయంలో హజా(నమాజ్) రావడంతో ఆయన ప్రసంగం ఆపేశారు. హజా పూర్తయ్యాక తిరిగి కొనసాగించారు. ఒక్కసారిగా ప్రసంగం ఆపేయడంతో అందరూ ఏమైందోనని చర్చించుకున్నారు.
అనువాదంలో ఆపసోపాలు
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆంగ్లంలో ప్రసంగించగా.. డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి తెలుగులో అనువాదం చేశారు. ఈ క్రమంలో పలు చోట్ల శివకుమార్ మాట్లాడింది కాకుండా మరోలా చెప్పడం.. లేదంటే మాట్లాడిన దానికంటే ఎక్కువ చేసి చెప్పడం చర్చనీయాంశమైంది. డిసెంబర్ 9న, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయం అని డీకే చెబితే.. రేవంత్‌రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని, సమయంతో సహా చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. సీఎం ఎవరనే విషయాన్ని ఈయనే డిసైడ్ చేశారన్న వ్యాఖ్యలు వినిపించాయి.
Comments
Please login to add a commentAdd a comment