
బలూర్‌ఘాట్: దేశంలో కోవిడ్–19 సెకండ్ వేవ్‌కు ప్రధాని మోదీ నిర్వహణాలోపమే కారణమని పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ దుయ్యబట్టారు. దక్షిణ దినాజ్‌పూర్ జిల్లా బలూర్‌ఘాట్‌లో బుధవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడారు. ‘దేశంలో కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది. ఇది మోదీ కారణంగా వచ్చిన విపత్తు. ఇంజెక్షన్లు, ఆక్సిజన్ లేదు. దేశంలో కొరత ఉన్నప్పటికీ టీకాలు, మందులు విదేశాలకు ఎగుమతి చేశారు’ అని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె విమర్శించారు.
ఆక్సిజన్, టీకాలు ఇవ్వలేని పక్షంలో పదవి నుంచి తప్పుకోవాలని ప్రధానికి సలహా ఇచ్చారు. రాష్ట్రంలో బెంగాల్ ఇంజిన్ ప్రభుత్వమే వస్తుంది తప్ప, మోదీ చెబుతున్న డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాదని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని చేజిక్కించుకునేందుకు, ఢిల్లీ నుంచి పాలించేందుకు గుజరాతీకి అవకాశం ఇవ్వరాదని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల పోరాటం బెంగాల్‌ను రక్షించడానికి, బెంగాలీ మాత గౌరవాన్ని కాపాడటానికేనని పేర్కొన్నారు. వామపక్ష– కాంగ్రెస్ కూటమికి ఓటేయరాదని, అలాచేస్తే బీజేపీకి ఊతమిచ్చినట్లే అవుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment