ఏపీలోని పల్నాడు జిల్లా గురజాలకు ఒకప్పుడు యరపతినేని శ్రీనివాసరావు ఎమ్మెల్యే. తెలుగుదేశం పార్టీ నుంచి ఆరు సార్లు పోటీ చేసిన ఆయన మూడు సార్లు విజయం సాధించారు. 2014లో టీడీపీ విజయంతో గురజాలలో యరపతినేని అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. పోలీసుల పోస్టింగ్‌లనుంచి మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియాల వరకు నేరాలకు నాయకత్వం వహించాడు.
అన్నిటికీ తన ఇంటినే అడ్డాగా మార్చాడు. నియోజకవర్గంలోని లైమ్ స్టోన్, ముగ్గురాయి అక్రమ క్వారీయింగ్‌తో మైనింగ్ డాన్‌గా ఎదిగాడు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఐదువేల కోట్లకుపైగా సంపాదించాడనే ఆరోపణలున్నాయి. అయ్యగారు చేసిన అరాచకానికి గత ఎన్నికల్లో గురజాల ఓటర్లు గట్టి గుణపాఠం నేర్పారు. జనం కొట్టిన దెబ్బకు ఏడాదివరకూ యరపతినేని శ్రీనివాసరావు నియోజకవర్గంలో కనిపించలేదు.
ఎన్నిక రాగానే హడావిడి
ప్రజలకు కనిపించకపోతే ఎక్కడ ఉనికి కోల్పోతానో అన్న భయంతో అప్పుడప్పుడు గురజాల వచ్చి తెగ హడావుడి చేస్తున్నారు యరపతినేని శ్రీనివాసరావు. ఆయన ఎంత హడావుడి చేసినా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకటి రెండు గ్రామాల్లో తప్ప నియోజకవర్గంలో ఎక్కడా పార్టీని గెలిపించలేకపోయాడు. పిడుగురాళ్ల మున్సిపాలిటీలో అయితే పోటీ చేసేందుకు ఒక్క అభ్యర్ది కూడా దొరకలేదు. దీంతో మున్సిపాలిటీలో అన్ని వార్డులు ఏకగ్రీవమయ్యాయి.
అయినా యరపతినేనికి బుద్దిరాలేదు. ఈసారి నేనే గెలుస్తా... మీ సంగతి తేలుస్తానంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ శ్రేణుల్ని రెచ్చగొడుతున్నారు. అయితే యరపతినేనికి ఇప్పుడు ఆయన పార్టీలోనే ఊహించని స్థాయిలో ఎదురుదెబ్బ తగిలింది. గురజాలకు చెందిన టీడీపీ నేత చల్లగుండ్ల శ్రీనివాస్ తెరపైకి వచ్చారు. యరపతినేనికి పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మెడికల్ క్యాంపులతో నియోజకవర్గం మొత్తాన్ని చుట్టేశారు. రెండుసార్లు చంద్రబాబును కలిసి యరపతినేనికి టికెట్ ఇవ్వద్దని, ఆయనకు టికెట్ ఇస్తే పార్టీ ఓడిపోవడం గ్యారెంటీ అని చెప్పారట.
చిన వర్సెస్ పెద్ద
యరపతినేని వ్యతిరేకులందరినీ కలిపి ఒకేతాటిపైకి తీసుకొచ్చి వ్యవహారం మొదలుపెట్టారు చల్లగుండ్ల శ్రీనివాస్. దీనికితోడు చంద్రబాబు కుటుంబానికి దగ్గరగా ఉన్న టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు నాదెండ్ల బ్రహ్మం కూడా యరపతినేనికి ఎర్త్ పెట్టడానికి చంద్రబాబు వద్ద పావులు కదుపుతున్నారు. ఇప్పుడు కొత్తగా చినకమ్మ, పెద్దకమ్మ ఫీలింగ్ తీసుకొచ్చారు. యరపతినేని పెదకమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. డాక్టర్ చల్లగుండ్ల శ్రీనివాస్, నాదెండ్ల బ్రహ్మంలు చినకమ్మ వర్గానికి చెందిన నేతలు. నియోజకవర్గంలో చినకమ్మ వర్గం ఓటర్లు 23వేల వరకూ ఉంటే, పెదకమ్మ ఓటర్లు కేవలం రెండు వేలే ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే.. తమ ఓట్లతో గెలిచి తమనే అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్న యరపతినేనిని ఎలాగైనా ఓడిస్తామంటున్నారు చిన్న కమ్మ వర్గం నాయకులు. అందుకే యరపతినేనితో ఢీ అంటే ఢీ అంటూ సవాళ్లు విసురుతున్నారు. యరపతినేనిపై తిరుగుబాటులో భాగంగానే నూతన సంవత్సర శుభాకాంక్షల పేరుతో గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్లలో చల్లగుండ్ల శ్రీనివాస్ భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ఫ్లెక్సీలలో ఎక్కడా యరపతినేని ఫొటో లేదు. ఇదే ఇప్పుడు గురజాల నియోజకవర్గంలోని టీడీపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఫ్లెక్సీల వ్యవహారంతో ఆగ్రహించిన యరపతినేని వర్గీయులు రాత్రికి రాత్రే చల్లగుండ్ల శ్రీనివాస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మొత్తం పీకేయించారు. అంతటితో ఆగకుండా వాటి స్థానంలో యరపతినేని ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెలుగుదేశం నాయకుల మధ్య ఫ్లెక్సీల యుద్ధం ఇప్పుడు తారా స్థాయికి చేరుకుంది.
చదవండి: ఏపీలో బీఆర్‌ఎస్.. ‘కారు’ సీన్ ఎంత?.. ఈ ప్రశ్నకు సమాధానమిదే..
యరపతినేని శ్రీనివాసరావుతో అమీతుమీ తేల్చుకునేందుకు చినకమ్మ సామాజికవర్గం నేతలందరూ ఏకమవుతున్నారు. గతంలో జనసేన తరపున పోటీ చేసిన చింతలపూడి శ్రీనివాసరావు కూడా రంగంలోకి దిగారు. ఇలా అందరూ యరపతినేనిని టార్గెట్ చేస్తూ అధిష్టానం వద్ద ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నారట. సొంతపార్టీ నేతలే తనపై తిరుగుబాటు చేస్తూ అధిష్టానం వద్ద పంచాయతీ పెట్టేందుకు రెడీ అవుతున్నారని తెలుసుకుని యరపతినేని వర్గీయులు తెగ హైరానా పడుతున్నారట. పచ్చ పార్టీలో యరపతినేని పరిస్థితి ఏమవుతుందో చూడాలి.
పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment