![Shatrughan Sinha Key Statement On Prashant Kishore - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/17/pk-singh.jpg.webp?itok=KRzF6xPf)
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఎన్నికల్లో ఓటముల పరంపర కొనసాగుతుండటంతో ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్‌ను వీడిన సంగతి తెలిసిందే. కాగా, కాంగ్రెస్ పార్టీని వీడటంపై తృణముల్ కాంగ్రెస్ నేత శత్రుఘ్న సిన్హా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గురువారం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తాను తృణముల్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రాజకీయ వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాల కీలక పాత్ర ఉందని అన్నారు. ఈ సందర్భంగానే టీఎంసీ పార్టీలో చేరడం మర్యాదగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం తన ఫోకస్ అంతా టీఎంసీపైనే ఉందన్నారు. అసన్‌సోల్ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో తాను పోటీ చేస్తున్నట్టు వెల్లడించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ, ప్రస్తుతం కాంగ్రెస్ సంక్షోభం ముంగిట్లో ఉందన్నారు. ఇలాంటి సమయంలో ఆ పార్టీపై విమర్శలు చేయడం ఇష్టం లేదన్నారు. అలాగే, కాంగ్రెస్‌లో తప్పులు ఎక్కడ జరిగాయో.. తాను ఎందుకు బయటకు వచ్చానో త్వరలో చెబుతానని అన్నారు.
మరోవైపు.. బెంగాల్‌లోని అసన్‌సోల్ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ టీఎంసీ అభ్యర్థిగా శత్రుఘ్న సిన్హాను బరిలోకి దింపుతున్నామని ప్రకటించారు. మరో ఉప ఎన్నిక బాలిగంజ్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా జరుగుతుండటంతో కేంద్ర మాజీ మంత్రి, సింగర్ బబుల్ సుప్రియోను బాలిగంజ్ నుంచి రంగంలోకి దింపుతున్నట్టు మమతా బెనర్జీ ట్విట్టర్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment