
ప్రమాణ స్వీకారం సందర్భంగా అభివాదం చేస్తున్న షేర్ బహదూర్ దేవ్‌బా
ఖాట్మాండూ: చివరి నిమిషం వరకూ ఉత్కంఠగా సాగిన నేపాల్ రాజకీయ సంక్షోభం.. నేపాలీ కాంగ్రెస్ చీఫ్ షేర్ బహదూర్ దేవ్‌బా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ముగిసింది. సాయంత్రం 6 గంటలకు (స్థానిక కాలమానం) ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉన్నప్పటికీ, రాత్రి 8 తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. నేపాల్ దిగువ సభను గత ప్రధాని ఓలీ సూచన మేరకు అధ్యక్షురాలు విద్యా దేవి భండారి రద్దు చేశారు. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు కాగా, సుప్రీంకోర్టు దేవ్‌బాకు అనుకూలంగా తీర్పు చెప్పింది.
మంగళవారం ఆయన చేత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయించాల్సిందిగా ఆర్టికల్ 76(5) కింద అధ్యక్షురాలికి ఆదేశాలిచ్చింది. అయితే ప్రమాణస్వీకారం కోసం అధ్యక్షురాలి కార్యాలయం ఇచ్చిన నోటీసులో సుప్రీంకోర్టు పేర్కొన్న ఆర్టికల్ 76(5) ప్రస్తావన లేదు. దీంతో ఆ ఆరి్టకల్ ప్రస్తావన ఉంచి కొత్త నోటీసు ఇచ్చే వరకు తాను ప్రమాణస్వీకారం చేయబోనని తేల్చి చెప్పారు. దీంతో అధ్యక్షురాలి కార్యాలయం దిగి వచ్చి రాత్రి 8.15 గంటలకు కొత్త నోటీసు జారీ చేసింది. అనంతరం అధ్యక్షురాలు విద్యాదేవి భండారి సమక్షంలో షేర్ బహదూర్ దేవ్‌బా నూతన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఆయన ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడం ఇది అయిదవ సారి కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment