
సాక్షి, ముంబై: శివసేన నేత, మాజీ మంత్రి అర్జున్ ఖోత్కర్ సోమవారం ఉద్ధవ్ ఠాక్రేతో తెగతెంపులు చేసుకుని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే వర్గంలో చేరారు. ఇటీవలే అర్జున్ ఖోత్కర్ ఢిల్లీ వెళ్లారు. అక్కడ శిందేతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రాగానే నేరుగా ముఖ్యమంత్రి శిందే వర్గంలో చేరారు. శిందే వర్గంలో అర్జున్ చేరడంతో శివసేనకు మంచి పట్టు ఉన్న జాల్నా జిల్లాలో ఉద్ధవ్ ఠాక్రేకు గట్టి దెబ్బ తగిలినట్లయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కొద్దిరోజుల కిందట ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌లో ఎంపీ సమావేశం జరిగింది. అదే రోజు ఖోత్కర్ ఢిల్లీ ప్రయాణమయ్యారు. అక్కడ మహారాష్ట్ర సదన్‌లో శిందేతో భేటీ అయినట్టుగా మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఆయన శిందే వర్గంలో చేరుతుండవచ్చని అప్పుడే జాల్నా నియోజక వర్గంలో ఊహగానాలు వెలువడ్డాయి. ఇప్పుడు అదే నిజమైంది. నేరుగా ఆయన శిందే వర్గంలో చేరారు.
అర్జున్‌కు శివసేన పార్టీలో ఓ నిబద్ధతగల కార్యకర్తగా పేరుంది. ఆయన నేతృత్వంలో జాల్నా జిల్లాలో పార్టీ పటిష్టంగా తయారైంది. ఎప్పుడు, ఎలాంటి ఎన్నికలు జరిగిన జాల్నా జిల్లాను ఖోత్కర్ కాపాడుతూ వస్తున్నారు. అయితే 2019 జరిగిన ఎన్నికల్లో అర్జున్ పరాజయం పాలయ్యారు. ఇప్పుడు శిందే వర్గంలో చేరి పోయిన ప్రతిష్టను పెంచుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇదిలాఉండగా మరఠ్వాడ రీజియన్ శివసేనకు కంచుకోట గా పేరుంది. కానీ తాజాగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలతో శివసేన రోజురోజుకూ బలహీన పడసాగింది. మరఠ్వాడలో అతిపెద్ద జిల్లా గా పేరుగాంచిన సంభాజీనగర్ (ఔరంగాబాద్)లో అనేక మంది ఎమ్మెల్యేలు, కార్యకర్తలు శిందే వర్గంలో చేరారు.
తిరుగుబాటు నేతల వలసలను ఆపడం ఉద్ధవ్ ఠాక్రేకు కష్టసాధ్యంగా మారింది. ము ఖ్యంగా రెండు రోజుల కిందటే యువసేన నాయకుడు ఆదిత్య ఠాక్రే పార్టీకి జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు, తిరుగుబాటు నేతల వలసలను ఆపేందుకు ఇక్కడ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా బలప్రదర్శన చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. పార్టీలో జరుగుతున్న చీలికలను అరికట్టేందుకు, ఉద్దవ్ ఠాక్రేపై పడుతున్న భారాన్ని తన భుజస్కందాలపై వేసుకునేందుకు ఆదిత్య ఠాక్రే మూడు రోజులపాటు పలు జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే.
చీలికలవల్ల మానసికంగా కుంగిపోతున్న పార్టీ కార్యకర్తలకు, పదాధికారులకు ఆయన మనోధైర్యాన్ని నూరిపోశారు. మన భగ్‌వా–మనదే శివసేన అనే నినాదంతో అందరితో భేటీ అయి, జరుగుతున్న పరిణామాలతో కుంగిపోవద్దని కార్య కర్తలకు, కిందిస్థాయి నేతలకు ధైర్యాన్ని ఇచ్చారు. కానీ ఆయన సభ జరిగిన రెండు రోజుల్లోనే అర్జున్ ఖోత్కర్ శిందే వర్గంలోకి ప్రవేశించి శివసేనను ఊహించని విధంగా దెబ్బ తీశారు. దీంతో ఆదిత్య ఠాక్రే పర్యటన, నూరిపోసిన మనోధైర్యం ఎలాంటి ప్రభావం చూపలేదని దీన్ని బట్టి స్పష్టమైతోంది. శివసేనకు దెబ్బమీద దెబ్బ తగులుతూనే ఉంది.