కర్ణాటకలో అధికార పీఠం కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ హస్తిన వేదికగా హోరాహోరీ తలపడుతున్నారు. మధ్యేమార్గంగా చెరో రెండున్నరేళ్లు పదవిని పంచుకోవాలని అధిష్టానం ప్రతిపాదించినా సిద్ధరామయ్యకు తొలి చాన్సిచ్చేందుకు డీకే ససేమిరా అంటున్నారు. ‘‘అన్నదమ్ముల్లా సమానంగా పంచుకోవడానికి అదేమీ వారసత్వపు ఆస్తి కాదు! సీఎం పదవి. ప్రభుత్వ ఏర్పాటుతో ముడిపడ్డ అంశం. పంచుకునే సమస్యే లేదు’’ అని ఆయన కరాఖండిగా చెబుతున్నారు. డీకే అభ్యంతరాల వెనక సహేతుకమైన కారణాలు లేకపోలేదు. కర్ణాటకతో సహా పలు రాష్ట్రాల్లో ఇలాంటి ప్రయోగాలు పెద్దగా ఫలించిన దాఖలాలు లేవు!
ఛత్తీస్‌లో ‘చెయ్యి’చ్చిన భగెల్
ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలోనే ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో పార్టీలోనే ముఖ్య నేతల మధ్య పవర్ షేరింగ్ ఫార్ములా బెడిసికొట్టింది. అక్కడ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధించింది. భూపేశ్ భగెల్ (62), త్రిభువనేశ్వర్ శరణ్ సింగ్‌దేవ్ (70) సీఎం పదవి కోసం పట్టుబట్టారు. దాంతో అధిష్టానం ఇప్పుడు సిద్ధూ–డీకే ద్వయానికి ప్రతిపాదించిన ఫార్ములానే అమలు చేసింది. చెరో రెండున్నరేళ్లు సీఎంగా ఉండేలా రాజీ ఫార్ములా కుదిర్చింది.
సింగ్‌దేవ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలతో సరిపెట్టుకోగా తొలుత భగెల్ గద్దెనెక్కారు. తీరా 2021 జూలైలో రెండున్నరేళ్లూ ముగిశాక తప్పుకుని సింగ్‌దేవ్‌కు చాన్సిచ్చేందుకు ససేమిరా అన్నారు. ఇప్పటికీ సీఎంగా కొనసాగుతున్నారు. అగ్ర నేత రాహుల్‌గాంధీ రాష్ట్రాన్ని సందర్శించి అభివృద్ధి పనులన్నీ కళ్లారా చూశాక తనను ఉంచాలో, దించాలో డిసైడ్ చేస్తారని చెబుతూ రెండేళ్లుగా కాలం వెళ్లదీస్తున్నారు.
అధిష్టానం జోక్యం కోసం ఎదురు చూసి చిర్రెత్తుకొచ్చిన సింగ్‌దేవ్ ఇటీవలే మంత్రి పదవులకు రాజీనామా చేసినా లాభం లేకపోయింది. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో భగెల్‌ను మార్చే ఉద్దేశం కూడా హస్తిన పెద్దలకు లేనట్టే కని్పస్తోంది!
కర్ణాటకలోనే ఫెయిలైంది’...
కర్ణాటకలోనే దాదాపు 20 ఏళ్ల క్రితం బీజేపీ, జేడీ(ఎస్) మధ్య సీఎం పదవి పంపకం కథ ఇలాగే అడ్డం తిరిగింది. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు. బీజేపీకి 79, కాంగ్రెస్‌కు 65, జేడీ(ఎస్)కు 58 సీట్లొచ్చాయి. కాంగ్రెస్, జేడీ(ఎస్) సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. కానీ రెండేళ్లకే కాంగ్రెస్‌కు జేడీ(ఎస్) చెయ్యిచ్చింది. సంకీర్ణాన్ని కూలదోసి 2006 ఫిబ్రవరిలో బీజేపీతో జట్టు కట్టింది. చెరో 20 నెలలు సీఎం పదవిని పంచుకునేలా ఒప్పందం కుదిరింది.
తొలి చాన్సు దక్కించుకున్న జేడీ(ఎస్) నేత కుమారస్వామి ఒప్పందం మేరకు 2007 అక్టోబర్‌లో గద్దె దిగేందుకు ససేమిరా అన్నారు. 4,5రోజుల హైడ్రామా తర్వాత ఆయన రాజీనామాతో రాష్ట్రం రాష్ట్రపతి పాలనలోకి వెళ్లింది. నెల తర్వా త జేడీ(ఎస్) బెట్టు సడలించడంతో బీజేపీ నేత యడియూరప్ప యడియూరప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ శాఖల పంపిణీలో విభేదాలు రావడంతో యడ్డీ సర్కారుకు మద్దతివ్వను పొమ్మన్నారు కుమారస్వామి! అలా బీజేపీ–జేడీ(ఎస్) సంకీర్ణం కథ పూర్తిగా పట్టాలెక్కకుండానే కంచికి చేరింది!
యూపీలోనూ అంతే
1996లో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్, బీఎస్పీ ముందస్తు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాయి. ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు. మొత్తం 424 స్థానాలకు గాను 174 సీట్లతో బీజేపీ అతి పెద్ద పార్టీగా నిలవగా సమాజ్‌వాదీకి 110, బీఎస్పీకి 67, కాంగ్రెస్‌కు 33 స్థానాలు దక్కాయి. కొద్ది నెలల రాష్ట్రపతి పాలన అనంతరం కాంగ్రెస్‌కు బీఎస్పీ గుడ్‌బై చెప్పింది. ఆర్నెల్లకోసారి అధికారాన్ని మార్చుకునే ఒప్పందంతో బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
1997 మార్చిలో మాయావతి సీఎం అయ్యారు. సెప్టెంబర్లో ఆమె గద్దె దిగి బీజేపీ నేత కల్యాణ్‌సింగ్ సీఎం అయ్యారు. నెల రోజులకే బీఎస్పీ మద్దతు ఉపసంహరించడంతో సంకీర్ణం కథ ముగిసింది. అంతకుముందు 1995లోనూ బీజేపీ–బీఎస్పీ సంకీర్ణ సర్కారు ఐదు నెలలకే కుప్పకూలింది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment