చేతులు కాలాక ‘సిట్‌’! | A special investigation team was formed on Friday to investigate the incidents of violence | Sakshi
Sakshi News home page

చేతులు కాలాక ‘సిట్‌’!

Published Sat, May 18 2024 4:53 AM | Last Updated on Sat, May 18 2024 4:53 AM

A special investigation team was formed on Friday to investigate the incidents of violence

ఏపీలో పరిస్థితులకు ఈసీ పక్షపాత వైఖరే ప్రధాన కారణం 

రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గడంతో చెలరేగిన హింసాకాండ

చంద్రబాబు, పురందేశ్వరి జాబితాకు ఈసీ ఆమోదంతో రెచ్చిపోయిన పచ్చముఠాలు

అనుకూల అధికారుల అండతో తెగబడిన అల్లరి మూకలు

శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లాక తాపీగా మేలుకున్న ఎన్నికల సంఘం

వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో 13 మంది అధికారులతో ‘సిట్‌’.. రెండు రోజుల్లో నివేదికకు ఆదేశం

అవసరమైతే అదనపు సెక్షన్లు.. కొత్త ఎఫ్‌ఐఆర్‌ల నమోదు

సాక్షి, అమరావతి: ఎన్నికల హింసపై ఎన్నికల కమిషన్‌ (ఈసీ) వ్యవహరిస్తున్న తీరు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా తయారైంది! రాష్ట్రంలో పోలింగ్‌ రోజు, ఆ తరువాత జరిగిన హింసాకాండకు ఏకైక కారణం రాజకీయ ఒత్తిళ్లతో పోలీస్‌ ఉన్నతాధికారులను ఈసీ ఏకపక్షంగా బదిలీ చేయ­డమే! ఆ స్థానంలో వచ్చిన అధికారులకు క్షేత్రస్థాయి పరిస్థితులపై సరైన అవగాహన లేకపోవడంతో­పాటు పచ్చముఠాల ఆగడాలను ఉపేక్షించడం వల్ల భయానక పరిస్థితులు నెలకొన్నాయి. 

ఈ క్రమంలో నష్ట నివారణ చర్యలకు దిగిన ఈసీ ఆదేశాల మేరకు హింసాత్మక ఘటనలపై విచారణకు శుక్రవారం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఏర్పాటైంది. ఎస్‌ఐబీ ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో 13 మంది పోలీసు అధికారులతో ఏర్పాటైన ‘సిట్‌’ రెండు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఈసీ ఆదేశించింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో పోలింగ్‌ సందర్భంగా చెలరేగిన హింసపై ‘సిట్‌’ దర్యాప్తు చేయనుంది. 

హింస చెల­రేగడంలో పోలీసు అధికారుల పాత్రను కూడా ‘సిట్‌’ నిగ్గు తేల్చనుంది. ఆయా చోట్ల నమోదు చేసిన కేసు­లు, విచారణ తీరు­తెన్నులపై పరిశీలించి వాస్తవాలు తేల్చాలని సిట్‌కు స్పష్టం చేసింది. అదనపు సెక్షన్లు, అవసరమైతే కొత్త ఎఫ్‌ఐఆర్‌ల నమోదును సూచించాలని పేర్కొంది. ఎస్పీలు, ఇతర పోలీసు అధికా­రులు సిట్‌ విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది. 

అనుకూల అధికారుల అండతో..
‘సిట్‌’ ఏర్పాటు చేసి నష్టనివారణ చర్యలకు దిగేలా పరిస్థితులు మారడానికి ఈసీ తీసుకున్న నిర్ణయాలే ముఖ్య కారణంగా ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు ముందు చంద్రబాబు, పురందేశ్వరి ఒత్తి­ళ్లకు తలొగ్గి ఎడాపెడా పోలీస్‌ అధికారులను మార్చే­సి, వారి సూచనల మేరకు ఈసీ నియామకాలు చేపట్టింది. అనుకూల అధికారుల అండ చూసుకుని పల్నాడు, రాయలసీమతో పాటు ఇతర ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి.

వైఎస్సార్‌సీపీ నాయ­కులు, ఆ పార్టీకి ఓటు వేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మహిళలే లక్ష్యంగా దాడులకు తెగబడ్డాయి. పరిస్థితులు చేయి దాటాక ఈసీ మేల్కొంది. దిద్దు­బాటు చర్యల్లో భాగంగా అనంతపురం, పల్నాడు ఎస్పీలపై సస్పెన్షన్‌ వేటు వేయడంతో పాటు పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీని బదిలీ చేసింది. 

మూడు జిల్లాల్లో 12 మంది పోలీసులపై సస్పెన్షన్‌ కొరడా ఝుళిపించింది. ఈ క్రమంలో సిట్‌ ఏర్పా­టైంది. మొత్తం వ్యవహారంలో ఈసీ తీరు చర్చనీ­యాంశంగా మారింది. రాష్ట్రంలో చెలరేగిన హింస, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఈసీ పక్షపాత వైఖరి ఫలితమేనని పరిశీలకులు పేర్కొంటున్నారు.

ఒత్తిళ్లకు తలొగ్గి ఉదాశీనత..
గత ఐదేళ్లుగా అన్ని వర్గాల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి పెద్దపీట వేసి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జనరంజక పాలన అందించారు. ప్రజాదరణ కోల్పోయి దిక్కుతోచని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏం చేయాలో పాలుపోక దుష్ప్రచారాలతో పేట్రేగిపోయింది. ఎన్ని కుట్రలు చేసినా ప్రజాదరణ దక్కకపోవడంతో పల్నాడు, ప్రకా­శం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పెద్ద ఎత్తున హింసకు చంద్రబాబు ప్రణాళిక రచించారు. ఆయా జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పట్టున్న సమర్థులైన పోలీసు అధికా­రులు ఉంటే తమ పన్నాగాలు పనిచేయవని పసిగట్టి నిరాధాణ ఆరోపణలతో ఈసీకి ఫిర్యాదులు చేశారు. 

పురందేశ్వరి సహకారంతో పల్నాడు, ప్రకా­శం, తిరు­పతి తదితర జిల్లాల్లో ఎవరిని నియమించాలో కూడా సూచిస్తూ ఏకంగా జాబితాను అందచేశారు. పచ్చ­ముఠా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి డీజీపీ, నిఘా విభాగం ఇన్‌చార్జ్‌తో పాటు పలువురు డీఐజీ, ఎస్పీలను ఈసీ పక్కనపెట్టింది. టీడీపీతో సత్సంబంధాలున్న వారిని రాజకీయ ఒత్తిళ్లతో అత్యంత సమ­స్యాత్మక ప్రాంతాల్లో నియమించింది. పల్నాడు ఎస్పీగా గరికపాటి బిందుమాధవ్‌ను నియమించడమే ఇందుకు నిదర్శనం. 

ఈ అధికారి నరసరావు­పేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. ఈ పార్లమెంట్‌ స్థానంలో వైఎస్సార్‌­సీపీకి గట్టి పట్టు ఉంది. 2019లో ఈ పార్లమెంట్‌ పరిధిలోని ఏడు స్థానాలను పార్టీ స్వీప్‌ చేసింది. దీంతో అధికార పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో పోలింగ్‌ సజావుగా జరగకుండా నిలువరించేలా కృష్ణదేవ­రాయలు స్కెచ్‌ వేశారు. క్షేత్రస్థాయిలో తన సామా­జికవర్గానికి చెందిన వారిని నియమించుకుని పల్నా­డులో అరాచకానికి కృష్ణదేవరాయలు ముఖ్యకారణ­మ­య్యా­రని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

చోద్యం చూసిన అధికారులు..
అనుకూల అధికారి అండ చూసుకుని పల్నా­డులోని నరసరావుపేట, మాచర్ల, గురజాల, కొత్త గణేశుని­పాడులో టీడీపీ రౌడీ మూకలు రెచ్చిపో­యాయి. పెట్రోలు బాంబులు, వేట కొడవళ్లు, బరి­సెలు, బాకులు, ఇనుప రాడ్లతో స్వైర విహారం చేశాయి. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు, ఆ పార్టీకి ఓటు వేసినట్లు భావించిన వారిపై యథేచ్ఛగా దాడులకు తెగబడ్డాయి. 

ఇంత జరుగుతున్నా పల్నా­డు ఎస్పీ బిందు మాధవ్‌తోపాటు ఆయన ఆధ్వర్యంలోని డీఎస్పీలు, సీఐలు చోద్యం చూశారు. టీడీపీ మూకల నుంచి తమకు, ప్రజలకు రక్షణ కల్పించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఫోన్లు చేసినా పోలీసులు పెడచెవిన పెట్టారు.

సీమలో వివాదాస్పదం
అనంతపురం జిల్లాలో కొందరు పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. పోలింగ్‌కు ముందు ఈ జిల్లాకు అమిత్‌ బర్దర్‌ను ఎస్పీగా నియమించారు. తొలి నుంచి ఆయన టీడీపీకి కొమ్ముకాశారు. కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట ప్రసాద్‌ వాహనంలో రూ.2 కోట్లు లభ్యమైతే కేసు నమోదు చేయకుండా తాత్సారం చేయడం ఆయన పచ్చపాత వైఖరికి నిదర్శనం. ఎన్నికల రోజు తాడిపత్రిలో టీడీపీ నాయ­కులు జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి, దీపక్‌రెడ్డి పోలింగ్‌ కేంద్రాల్లో చొరబడి అక్రమాలకు పాల్పడ్డారు. 

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి నివాసంపై టీడీపీ గూండాలు రాళ్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలను నియంత్రించడంలో ఎస్పీ విఫలమయ్యారు. మరో­వైపు పోలీసులు పెద్దారెడ్డి నివాసంలోకి చొరబడి విధ్వంసానికి పాల్పడ్డారు. వారి చర్యలు సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా ముందుగానే ధ్వంసం చేసిన ఫుటేజ్‌లు సోషల్‌ మీడి­యాలో వైరల్‌ అయ్యాయి. 

తిరుపతి జిల్లాలో చంద్రగిరి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిపై టీడీపీ గూండాలు దాడి చేసి ఆయన వాహన శ్రేణిలోని వాహనానికి నిప్పుపెట్టారు. ఇక్కడ కూడా అల్లర్లను కట్టడి చేయడంలో ఈసీ నియమించిన పోలీసు అధికారులు దారుణంగా విఫలమయ్యారు.

13 మందితో ‘సిట్‌’
సాక్షి, అమరావతి: ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలపై విచారణకు ఈసీ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ‘సిట్‌’ ఏర్పాటు చేసింది. ఎస్‌ఐబీ ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో 13 మంది పోలీసు అధికారులతో ఏర్పాటైన ‘సిట్‌’ పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో జరిగిన హింసపై విచారణ జరిపి రెండు రోజుల్లో ఎన్నికల కమిషన్‌కు నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో డీజీపీ ఆదేశించారు.

‘సిట్‌’ సభ్యులు...
1. రమాదేవి, ఎస్పీ, ఏసీబీ
2. సౌమ్యలత, ఏఎస్పీ, ఏసీబీ
3. రమణమూర్తి, డీఎస్పీ, ఏసీబీ, శ్రీకాకుళం
4. పి.శ్రీనివాసులు, డీఎస్పీ, సీఐడీ
5. వి.శ్రీనివాసరావు, డీఎస్పీ, ఏసీబీ, ఒంగోలు
6. రవి మనోహరా చారి, డీఎస్పీ, ఏసీబీ, తిరుపతి
7. వి.భూషణం, ఇన్‌స్పెక్టర్, గుంటూరు రేంజి
8. కె.వెంకట్రావు, ఇన్‌స్పెక్టర్, ఇంటెలిజెన్స్, విశాఖ
9. రామకృష్ణ, ఇన్‌స్పెక్టర్, ఏసీబీ
10. జీఎల్‌ శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్, ఏసీబీ
11. మొయిన్, ఇన్‌స్పెక్టర్, పీటీసీ, ఒంగోలు
12. ఎన్‌.ప్రభాకర్, ఇన్‌స్పెక్టర్, ఏసీబీ, అనంతపురం
13. శివప్రసాద్, ఇన్‌స్పెక్టర్, ఏసీబీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement