సాక్షి, అమరావతి: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనపై ఎస్సీ, ఎస్టీ చట్టంతోపాటు హత్యాయత్నం కింద నమోదైన కేసులో దర్యాప్తు నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది. కేసు ప్రాథమిక దశలో ఉన్నందున దర్యాప్తును నిలిపివేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఫిర్యాదుదారు వాదన వినకుండా ఉత్తర్వులు ఇవ్వడం కూడా సాధ్యం కాదంది. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో ఫిర్యాదుదారు వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని గుర్తు చేసింది.
ఒకవేళ ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తే మిగిలిన కేసుల్లో కూడా ఇలాంటి పిటిషన్లు కోకొల్లలుగా దాఖలవుతాయని తెలిపింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఫిర్యాదుదారు మాతంగి వెంకటకృష్ణను, పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై జస్టిస్ శ్రీనివాసరెడ్డి గురువారం విచారణ జరిపారు.
పోలీసుల తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే ముందు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద ఫిర్యాదుదారు వాదన వినడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంగా చెప్పిందని ఉదాహరణలతో వివరించారు. శ్రీధర్‌రెడ్డిపై నమోదైన కేసు ప్రాథమిక దశలోనే ఉందని తెలిపారు. అంతకు ముందు శ్రీధర్‌రెడ్డి తరపు న్యాయవాది తప్పెట నాగార్జునరెడ్డి వాదనలు వినిపిస్తూ.. రాజకీయ కారణాలతో కేసు నమోదు చేశారన్నారు. పిటిషనర్ విషయంలో ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment