దేశంలో ఎన్నికల పండుగ జరుగుతోంది. ఈ నేపధ్యంలో శ్రీనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం మే 13న ఆసక్తికర పోటీకి సిద్ధమైంది. మొత్తం 17,43,845 మంది ఓటర్లు.. బరిలో ఉన్న 24 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఈ ఎన్నికల్లో తొలిసారిగా రెండు లక్షల మంది ఓటు వేయనున్నారు.
2019 లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 తొలగించి, కేంద్ర పాలిత ప్రాంత హోదాను కల్పించారు. ఈ ప్రకియ తరువాత ఇప్పుడు తొలిసారిగా ఇక్కడ ఎన్నికల పోరు జరుగుతోంది. కశ్మీర్‌లోని ఐదు జిల్లాల్లో విస్తరించి ఉన్న శ్రీనగర్ నియోజకవర్గంలో ఆసక్తికర పోటీ నెలకొంది. ఇక్కడ అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించేందుకు 17,43,845 మంది ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. వీరిలో 8,73,426 మంది పురుషులు, 8,70,368 మంది మహిళలు కాగా, 51 మంది ట్రాన్స్‌జెండర్లు.
భారత ఎన్నికల కమిషన్ అందించిన డేటా ప్రకారం శ్రీనగర్, గందర్బాల్, బుద్గాం, పుల్వామా, షోపియాన్ జిల్లాల్లో మొత్తం 2,135 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ) నుండి అఘా సయ్యద్ రుహుల్లా మెహదీ, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) నుండి వహీద్-ఉర్-రెహ్మాన్ పర్రా ప్రధాన పోటీదారులుగా నిలిచారు. డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్‌కు అమీర్ భట్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
శ్రీనగర్ లోక్‌సభ స్థానంపై నేషనల్ కాన్ఫరెన్స్‌కు మంచి పట్టు ఉంది. నేషనల్ కాన్ఫరెన్స్ 2014 మినహా 1977 నుండి 2019 వరకు నిరంతరం ఈ స్థానాన్ని గెలుచుకుంటూ వస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి ఫరూక్ అబ్దుల్లా 1,06,596 ఓట్లతో విజయం సాధించారు. అయితే 2014లో పీడీపీ అభ్యర్థి తారిఖ్ హమీద్ కర్రా 1,57,923 ఓట్లతో గెలుపొందడంతో పరిస్థితి మారిపోయింది. కశ్మీర్‌లోని ఐదు స్థానాల్లో మూడింటిని ఎన్‌సీ కైవసం చేసుకుంది.
జమ్మూ కాశ్మీర్‌లో మొత్తం ఐదు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో మూడు నేషనల్ కాన్ఫరెన్స్, రెండు బీజేపీ చేతిలో ఉన్నాయి. శ్రీనగర్ లోక్‌సభ స్థానం నేషనల్ కాన్ఫరెన్స్‌కు బలమైన కోటగా ఉంది. పార్టీ 1947 నుండి 15 పార్లమెంటరీ ఎన్నికల్లో 12 సార్లు ఈ సీటును దక్కించుకుంది.
శ్రీనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో అబ్దుల్లా కుటుంబ ఆధిపత్యం మొదటి నుంచి ఉంది. అయితే ఈ సారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. శ్రీనగర్ లోక్‌సభ స్థానాన్ని సున్నితమైన స్థానంగా పరిగణిస్తారు. గత 35 ఏళ్లలో వేర్పాటువాదం, హింసాయుత ఘటనల కారణంగా ఈ ప్రాంతంలో తక్కువ శాతం ఓటింగ్ జరుగుతూ వస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఈసారి ఇక్కడి ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment