సుప్రీంకోర్టు తీర్పు ఆర్టికల్ 341కి వ్యతిరేకం
వర్గీకరణకు వ్యతిరేకంగా ఐక్య పోరాటం చేద్దాం
రిజర్వేషన్ల ఎత్తివేతలో భాగమే వర్గీకరణ
మాలల సింహగర్జన సభలో వక్తలు
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమని మాల సామాజిక వర్గానికి చెందిన పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. ఎస్సీలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలంతా ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఆదివారం ‘మాలల సింహగర్జన’ బహిరంగసభ నిర్వహించారు.
చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో జరిగిన ఈ సభకు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అధ్యక్షత వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు మాల సామాజికవర్గం నేతలు పాల్గొని ప్రసంగించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341లో పొందుపరిచిన రిజర్వేషన్ల సూత్రాలకు భిన్నంగా సుప్రీంకోర్టు తీర్పు ఉందని అన్నారు. ఎంఆర్‌పీఎస్ నేత మందకృష్ణ మాదిగ మనువాదుల అండతో ఎస్సీలను చీల్చే కుట్రకు దిగారని ఆరోపించారు.
మాలలకు అండగా ఉంటా: వివేక్
మాలల కోసం పోరాటం చేస్తోన్న తనపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేసినా వెనక్కి తగ్గలేదని ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ.. మాలలందరికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కుల వివక్ష నుంచి దళితులకు స్వాతంత్య్రం కల్పించేందుకు బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. తన తండ్రి వెంకటస్వామి దళితుల కోసమే పోరాడారని.. మాల, మాదిగ అనే తేడా చూడలేదని తెలిపారు. మాలలు ఐక్యంగా ఉండి హక్కుల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. తాను మంత్రి పదవి కోసమే మాలల పోరాటాన్ని మొదలుపెట్టానని కొందరు ఆరోపణలు చేస్తున్నారని.. తాను పదవుల కోసం ఆరాటపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు జరుగుతున్న కుట్రలను దళిత సమాజం గుర్తించాలని కోరారు.
మాల, మాదిగలు కలిసి పోరాడాలి: ఎంపీ మల్లు రవి
రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను ఐక్యంగా ఎదుర్కోవాలని నాగర్‌కర్నూలు ఎంపీ మల్లు రవి పిలుపుని చ్చారు. మాల, మాదిగల మధ్య విభేదాలు సృష్టించి, రిజర్వే షన్లను ఎత్తేసేలా చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. మాల, మాదిగలు తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాడాల ని సూచించారు. ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్ల అమ లుకు ఉద్యమించాలన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. కొన్ని పార్టీలు, వర్గాలు మాలలపై దోపిడీదారుల ముద్ర వేశాయని ఆరోపించారు.
బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణను తాము అడ్డుకోవడం లేదని, అందరికీ సమ న్యాయం కావాలని కోరుకుంటున్నట్లు మాజీ మంత్రి శంకర్ రావు చెప్పారు. మాలల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు రాంచందర్ మాట్లాడుతూ రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు పోరాటం చేస్తామని ప్రకటించారు. సభలో ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, ఎమ్మెల్యే శ్రీగణేష్, పాశ్వాన్, మాజీ ఎంపీ మంద జగన్నాథం, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, మాల మహానాడు అధ్యక్షుడు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment