
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం రెండూ సమాంతరంగా జరుగుతోందని మత్య్స, పశుసంవర్థశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సామాజిక న్యాయం చేయాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని పేర్కొన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. మహిళలకు కూడా సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.
అభివృద్ధికే పట్టం కట్టాలని హుజురాబాద్ ప్రజలను కోరుతున్నామని మంత్రి తలసాని అన్నారు. రైతుబంధు, దళితబంధు పథకాలపై విపక్షాలది అనవసర ఆరోపణలని కొట్టిపారేశారు. విపక్షాల మాటలు నమ్మవద్దని, త్వరలో తెలంగాణ వ్యాప్తంగా దళిత బంధు అమలు చేస్తామని పేర్కొన్నారు. బాధ్యత లేకుండా విపక్షాలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాయని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఏడేళ్ల కాలంలో 74 ఏళ్ల చరిత్ర తిరగ రాశారన్నారు. ఇరిగేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment