లక్డీకాపూల్/బన్సీలాల్‌పేట్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లను రాష్ట్ర పశుసంవర్థ్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, మాజీ ఎంపీ వి.హనుమంతరావు పరిశీలించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో శాసనసభలో జరిగిన చర్చలో భట్టి చేసిన సవాల్‌ను మంత్రి తలసాని స్వీకరించారు. గురువారం ఉదయమే భట్టి ఇంటికి వెళ్లిన తలసాని.. ఆయన్ను తీసుకుని హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఇళ్లను చూపించారు. ఇళ్ల నిర్మాణం ఏ విధంగా జరుగుతుందో వివరించారు.
నెక్లెస్ రోడ్డులోని అంబేడ్కర్ నగర్, బన్సీలాల్‌పేట్ డివిజన్‌లోని గంగిడి ఎల్లయ్యదొడ్డి (జీవై కాంపౌండ్), చాచానెహ్రూనగర్, పొట్టిశ్రీరాములు నగర్, బండమైసమ్మనగర్ బస్తీల్లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లను వారు పరిశీలించారు. జియాగూడ, గోడేకిఖబర్, కట్టెలమండి, మారేడ్ పల్లి, అంబేడ్కర్‌నగర్, జీజీనగర్‌లలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న నిర్మాణాలను భట్టి నోట్ చేసుకున్నారు. ఆయా బస్తీల్లో ఎన్ని ఇళ్లు కడుతున్నారు.. ఎంతమంది పేదలకు ప్రయోజనం కలుగుతుంది వంటి విషయాలను తలసాని ఆయనకు వివరించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, కాంగ్రెస్ నాయ కులు అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.
పేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే..: తలసాని
మురికివాడల్లో నివసించే ప్రజలు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని మంత్రి తలసాని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలపై పైసా భారం లేకుండా ఉచితంగా ఇళ్లను నిర్మిస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. పోష్ కాలనీలను తలపించేలా నిర్మిస్తున్నందున పేదలు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు.
నేను చూసింది 3,428 ఇళ్లనే: భట్టి
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు చోట్ల డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించడానికి మంత్రి తలసానితో కలిసి వెళ్లానని, అయితే తాను గురువారం 3,428 ఇళ్లు మాత్రమే చూశానని భట్టి విక్రమార్క వెల్లడించారు. శుక్రవారం కూడా ఇళ్ల పరిశీలనకు వెళుతున్నానని, పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత ఈ విషయంపై స్పందిస్తానని చెప్పారు. తాము చూసిన వాటిలో చాలావరకు పాత ఇళ్లను కొత్తగా నిర్మిస్తున్నవేనని వ్యాఖ్యానిం చారు. ఈ ఇళ్ల నాణ్యతపై కొందరు ఇంజనీర్లు పరిశీలిస్తున్నారని, వారి నివేదిక వచ్చిన తర్వాత నాణ్యత గురించి కూడా చెబుతానన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించి ఇస్తామంటే తాము ఇళ్లు ఖాళీ చేసి వెళ్లామని, చాలా రోజులైనా తమకు ఇళ్లు ఇవ్వకపోవడంతో అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని లబ్ధిదారులు తనతో చెప్పారని భట్టి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment