గ్యాంగ్‌టక్: సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో సిక్కిం క్రాంతికారీ మోర్చా(ఎస్‌కేఎం) దూసుకుపోయింది. మొత్తం 32 స్థానాలకు గాను ఏకంగా 31 చోట్ల పార్టీ విజయం సాధించింది. ప్రతిపక్ష సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్(ఎస్‌డీఎఫ్)ను నామరూపాల్లేకుండా చేసింది.
పాతికేళ్లపాటు నిరంతరాయంగా రాష్ట్రాన్ని ఏలిన పార్టీకి 2019 ఎన్నికల్లో తొలిసారిగా ఓటమిని రుచి చూపించిన ఎస్‌కేఎం అధ్యక్షుడు, సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ వరుసగా రెండోసారి సీఎం కుర్చీని అధిష్టించబోతున్నారు. ఈ ఘన విజయాల వెనుక తమాంగ్ వ్యూహాలు, కృషి దాగి ఉన్నాయి.
ప్రేమ్ సింగ్ తమాంగ్ 1968 ఫిబ్రవరి 5న నేపాలీ దంపతులకు జన్మించారు. డార్జిలింగ్‌లో డిగ్రీ పూర్తి చేసిన ఆయన 1990లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చేరారు. మూడేళ్ల పాటు పాఠాలు బోధించిన తర్వాత సామాజిక సేవపై ఆసక్తి చూపించి రాజకీయం వైపు మళ్లారు. తమాంగ్‌ను పీఎస్ గోలేగా కూడా పిలుచుకుంటారు.
1994లో పవన్ చామ్లింగ్ స్థాపించిన ఎస్‌డీఎఫ్ చేరి కీలక నాయకుడిగా ఎదిగారు. వరుసగా ఐదుసార్లు ఎస్‌డీఎఫ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 వరకు పలు రకాల మంత్రిత్వశాఖలను నిర్వహించారు.
2009 ఎన్నికల తర్వాత తమాంగ్‌కు ఎస్‌డీఎఫ్‌తో విభేదాలు తలెత్తాయి. ఎమ్మెల్యేగా గెలిచినా పవన్ చామ్లింగ్ ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. మంత్రి పదవికి బదులు నామినేటెడ్ పదవి ఇచ్చారు.
దీనిని తిరస్కరించిన తమాంగ్, చామ్లింగ్ బంధుప్రీతి, అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించి రాజకీయ గురువుపైనే తిరుగుబాటు చేశారు. 2009 డిసెంబర్ 21న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఎస్‌డీఎఫ్‌పై నిప్పులు చెరిగారు. చివరికి 2013లో ఎస్‌కేఎం పేరుతో పార్టీని స్థాపించి తాజా గెలుపుతో రెండోసారి అధికారం చేపట్టబోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment