కె.రాహుల్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనసంఘ్ (బీజేపీగా ఏర్పడడానికి ముందు) తరఫున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గెలుస్తూ వచ్చారు. 1982కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా తీరు, రాజకీయాలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్న సందర్భంలో బీజేపీ సొంతంగా రాష్ట్రంలో ఓ రాజకీయశక్తిగా ఎదిగేందుకు సానుకూల పరిస్థితులున్నట్టు పార్టీ నేతలు అంచనా వేశారు.
అయితే టీడీపీ ఆవిర్భావం, ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించడం వంటి పరిణామాలు, టీడీపీతో పొత్తు, 1995లో ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసి చంద్రబాబు సీఎం అయ్యాక, ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో వచ్చిన మార్పుచేర్పులు, టీడీపీతో పొత్తుల కొనసాగింపు వంటివి రాష్ట్రంలో బీజేపీకి నష్టం చేశాయని చెప్పొచ్చు. తర్వాత 1998 లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో బీజేపీ ఒంటరిగా పోటీచేసి 4 ఎంపీ సీట్లు గెలుపొంది సత్తా చాటింది. అయితే ఆ వెంటనే 1999లో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కుదుర్చుకోక తప్పలేదు. ఆ పరిస్థితి తెలంగాణ ఏర్పడేదాకా కొనసాగడం రాజకీయంగా బీజేపీకి తీరని నష్టం చేసిందని ఆ పార్టీ అగ్రనేతలే చెబుతుండడం గమనార్హం.
12 సీట్ల నుంచి ఒక్క సీటుకు..
ఉమ్మడి ఏపీలో..1999లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీతో పొత్తుతో పోటీచేసి బీజేపీ 12 అసెంబ్లీ స్థానాలు గెలిచింది. ఉమ్మడి ఏపీ, ఆ తర్వాత తెలంగాణలో అవే కమలదళం గెలిచిన అత్యధిక సీట్లు. అయితే తెలంగాణ ఏర్పడ్డాక 2014లో తొలిసారి ఐదు సీట్లు సాధించినా, 2018లో రెండోసారి జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండా సొంతంగా పోటీ చేసినప్పుడు కేవలం 8 శాతం ఓట్లతో ఒక్క స్థానానికే పరిమితమైంది.
కానీ అనూహ్యంగా 2019 ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగానే 4 సీట్లు గెలుచుకోవడంతో పాటు ఓటింగ్ శాతాన్ని ఒక్కసారిగా 20 శాతానికి పెంచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో నువ్వా నేనా అన్నట్టుగా జరిగిన పోటీలో విజయం సాధించడం, ఈ రెండు ఉప ఎన్నికల మధ్య జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఏకంగా 48 సీట్లు (దీనికి ముందు 4 సీట్లే) గెలుపొందడంతో ఒక్కసారిగా బీజేపీపై అంచనాలు పెరిగిపోయాయి.
ఈ పరిస్థితుల్లో జరిగిన మునుగోడు ఉపఎన్నికలో రాజగోపాల్‌రెడ్డి విజయం సాధించడం ఖాయమని పార్టీ వర్గాలు అంచనా వేసినా, 12 వేల ఓట్ల తేడాతో బీఆర్‌ఎస్‌చేతిలో ఆయన ఓటమి చవిచూశారు. అయితే అంతకు ముందు అంటే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి పడిన 13 వేల ఓట్లు 90 వేల ఓట్లకు పెరగడం బీజేపీకి కొంత ఊరటనిచ్చింది. ఈ విధంగా ఈ అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మూడో స్థానానికే పరిమితం చేయడం విశేషం. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన కుందూరు జానారెడ్డి రెండో స్థానంలో నిలిచారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ముచ్చటగా మూడోసారి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భవితవ్యం ఎలా ఉంటుందో చూడాలి.
మూడు వేర్వేరు గుర్తులపై జంగారెడ్డి విజయదుందుభి
1967లో భారతీయ జన సంఘ్ (బీజేఎస్) దీపం గుర్తుపై ఉమ్మడి ఏపీలో మూడుసీట్లు గెలవగా అందులో ఒక స్థానంలో తెలంగాణ నుంచి చందుపట్ల జంగారెడ్డి గెలు పొందారు. ఎమర్జెన్సీ తర్వాత ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో జాతీయ స్థాయిలో ఇందిరతో విభేదించి బయటకు వచ్చిన లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో బీజేఎస్, ఇతర పార్టీలు కలిపి జనతా పార్టీ ఏర్పడింది.
1978లో ఉమ్మడి ఏపీలో జనతా పార్టీ నాగలిపట్టిన రైతు గుర్తుపై 60 మంది గెలుపొందగా, వారి లో తెలంగాణ నుంచి జంగారెడ్డి ఉన్నారు. ఇక 1980లో బీజేపీ ఏర్పడ్డాక ఇందిరాహత్యానంతరం జరిగిన 1984 లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో దేశవ్యాప్తంగా వీచిన కాంగ్రెస్ ప్రభంజనాన్ని తట్టుకుని ఏపీలో టీడీపీ 30 సీట్లు గెలిచింది. ఆ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో బీజేపీ రెండే రెండు సీట్లు గెలవగా అందులో ఒకటి హన్మకొండ. ఇక్కడ కమలం గుర్తుపై పోటీ చేసిన జంగారెడ్డి నాటి కేంద్రమంత్రి పీవీ నరసింహారావును ఓడించి చరిత్ర సృష్టించారు.
బండి సంజయ్ మార్పుతో..
రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ ఏడాది మార్చిలో మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న బండి సంజయ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగిసే దాకా పదవిలో కొనసాగుతారని అంతా భావించారు. కానీ కొన్నాళ్లకే సంజయ్‌ను మారుస్తున్నారంటూ ప్రచారం మొదలై రెండు, మూడు నెలలు కొనసాగింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డిని నాలుగోసారి (ఉమ్మడి ఏపీలో రెండు సార్లు, ఈ విడత కలుసుకుని తెలంగాణలో రెండోసారి) రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ నియమించింది. దీంతో కేడర్‌లో స్తబ్దత, కొంత అయోమయ వాతావరణం ఏర్పడింది.
మోదీ సభలతో నయా జోష్
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే లోగానే ప్రధాని మోదీ ఈ నెల 1న మహబూబ్‌నగర్, 3న నిజామాబాద్‌లలో జరిపిన పర్యటన పార్టీలో కొత్త ఉత్సాం నింపిందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు తొమ్మిదేళ్లలో బీజేపీ చేసిన అభివృద్ధిని ప్రధాని వివరించడం ప్రజల్లో సానుకూలత పెరగడానికి దోహదపడిందని అంటు న్నారు.
ఇక షెడ్యూల్ వెలువడిన మరుసటి రోజే బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆదిలాబాద్‌లో జనగర్జన సభ నిర్వహించారు. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడాల్సి ఉండగా, ఎన్నికల ప్రచార గడువు ముగిసే నాటికి పది ఉమ్మడి జిల్లాల పరిధిలో మూడేసి చొప్పున మోదీ, అమిత్‌షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాల బహిరంగ సభలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఈ సభల విజయవంతం, వీటిలో ప్రస్తావించే అంశాలు, ఇచ్చే హామీలు పార్టీకి మరింత మేలు చేస్తాయని బీజేపీ నేతలు ఆశిస్తున్నారు.
బీజేపీ విజయం ఇలా..
- 1980లో పార్టీ ఏర్పడ్డాక ఉమ్మడి ఏపీలో, ఆ తర్వాత తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన ఎమ్మెల్యే సీట్ల వివరాలు ఇలా ఉన్నాయి.
- 2018లో కేవలం ఒకేఒక్క సీటు టి.రాజాసింగ్ గెలుపొందగా..అంతకుముందు వరుసగా మూడుసార్లు గెలిచిన జి.కిషన్‌రెడ్డి ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. ఆ తర్వాత జరిగిన రెండు ఉప ఎన్నికల్లో దుబ్బాక నుంచి ఎం.రఘునందన్‌రావు, హుజూరాబాద్ నుంచి ఈటల రాజేందర్ గెలుపొందారు. 1983 నుంచి వరుసగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బలం పెరుగుతూ... తగ్గుతూ వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment