సాక్షి, అమరావతి : ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పదవీకాలం మరో 9 నెలల్లో ముగియనుందని.. అనంతరం జరిగే సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వరుస విజయాన్ని సొంతం చేసుకోనుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి చెప్పారు. వైఎస్సార్‌సీపీకి రెండోసారి విజయాన్ని కట్టబెట్టేలా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు విరాజిల్లుతున్నాయని పేర్కొన్నారు.
తాడేపల్లిలో గురువారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 2024 మార్చి 15లోగా ఏపీ శాసనసభ ఎన్నికల తేదీలు ప్రకటిస్తారని తెలిపారు. 2019 ఎన్నికల తేదీలు ప్రకటించేందుకు ఆరు నెలల ముందు నాటి అధికార టీడీపీ.. ఓటర్ల వ్యక్తిగత వివరాలను తనకు అనుకూలంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తాయని, ఆ తర్వాత అవి వాస్తవాలన్న విషయం ప్రజలకు అర్థమైందని తెలిపారు.
ఇంటింటికి వెళ్లి సర్వేల పేరుతో వివరాలు సేకరించి నాడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్‌సీపీ అభిమానుల ఓట్లు తొలగించే కార్యక్రమాలు టీడీపీ చేసిందని, వైఎస్ జగన్ నేతృత్వంలోని పార్టీ యావత్తూ ఉద్యమించి.. నాటి టీడీపీ సర్కారు అప్రజాస్వామిక చర్యలకు అడ్డుకట్టవేశారని గుర్తు చేశారు.వైఎస్సార్‌సీపీ ప్రజాహిత విధానాలు, కార్యక్రమాల కారణంగా వరుసగా రెండోసారి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని రాజకీయ నిపుణులు, విశ్లేషకులు కూడా అంచనావేస్తున్నారని చెప్పారు. నాలుగున్నరేళ్లుగా నగదు బదిలీ ప్రక్రియ విజయవంతంగా అమలవుతోందని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనతో ప్రజలు గరిష్ట స్థాయిలో సంతృప్తి చెందుతున్నారని తెలిపారు.
గత ఎన్నికలప్పుడు టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేసిన కట్టుకథలను కొంతమంది నమ్మి ఉండొచ్చని, కానీ ఇప్పుడు వైఎస్సార్‌సీపీ శాసన సభ, లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి తిరుగులేని విజయం సాధిస్తుందనడంపై రాష్ట్రం ప్రజానీకానికి ఎలాంటి అనుమానాలూ లేవన్నారు. వైఎస్సార్‌సీపీని రెండోసారి గెలిపించి తమ సంక్షేమానికి, ప్రగతికి మార్గం సుగమం చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారనేది జగమెరిగిన సత్యమని విజయసాయిరెడ్డి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment