
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం నామినేషన్ల పర్వం మొదలైంది. తొలి రోజున ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సహా పలువురు స్వత్రంత అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వీరిలో పద్మరాజన్(62) కూడా ఉన్నారు. ప్రత్యేకంగా ఈయన పేరే ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే.. రాష్ట్రంలో ప్రతి ఎన్నికల్లో నామినేషన్ వేయడం ద్వారా ఆయన ‘తేర్దల్ మన్నన్ ’(ఎన్నికల రాజు)గా పేరుగాంచారు. ఇక ఏప్రిల్ 6న శాసన సభ ఎన్నికలు జరుగనున్న తరుణంలో మేట్టూరు నియోజకవర్గం నుంచి స్వతంత్రపద అభ్యర్దిగా నామినేషన్ వేశారు.
కాగా 8వ తరగతి మాత్రమే చదువుకున్న పద్మరాజన్ సహకార సంఘాల ఎన్నికల నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు నామినేషన్లు వేయడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. తన ఇంటికి టెలిఫోన్ సౌకర్యం కోసం 1988లో తొలిసారిగా మేట్టూరు అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేశారు. గిన్నీస్‌బుక్‌లో స్థానం కోసం ఆ తరువాత నుంచి అన్ని ఎన్నికల్లో నామినేషన్లు వేయడం కొనసాగించారు. ప్రధాని, ముఖ్యమంత్రి, అగ్రనేతలు పోటీచేసే స్థానాల్లో నామినేషన్లు వేయడం ద్వారా గుర్తింపు పొందారు. డిపాజిట్టుకు సొమ్ములేని పక్షంలో భార్య నగలు కుదువపెట్టి మరీ నామినేషన్లు వేస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment