చెన్నె: తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమిళ ప్రజలు సరికొత్త తీర్పు ఇచ్చారు. పదేళ్ల తర్వాత డీఎంకే అధికారంలోకి వచ్చింది. అయితే ఎన్నో అంచనాలతో దూకుడుతో వచ్చిన సినీ నటీనటులకు మాత్రం ఈ ఎన్నికలు చుక్కలు చూపించాయి. ఒక్క ఉదయనిధి స్టాలిన్ తప్ప అందరూ పరాజయం మూటగట్టుకున్నారు. వారి చరిష్మా వెండితెర వరకే అని ఈ ఎన్నికల తీర్పు చెబుతోంది. తమిళ రాజకీయాలకు సినీ పరిశ్రమకు విడదీయరాని బంధం. కొన్ని దశాబ్దాలుగా తమిళ రాజకీయాలను సినీ ప్రముఖులు ఏలారు. దాదాపు నలభై ఏళ్లకు పైగా సినీ రంగానికి చెందినవారే రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అప్పుడు వేరు.. ఇప్పుడు వేరనట్టు తెలుస్తోంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన సినీతారలంతా పరాజయం పాలయ్యారు.
గతంలో రాష్ట్రాన్ని శాసించిన సినీనటులు ఇప్పుడు గెలవడమే కష్టంగా మారింది. ఎంజీఆర్ మొదలుకుని జయలలిత, కరుణానిధి వరకు సినీ పరిశ్రమకు చెందిన వారే. రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రాన్ని ఏకచత్రాధిపత్యంగా పాలించారు. ప్రస్తుతం రాజకీయాలకు సినీ పరిశ్రమ దూరం కానుందేమో. ముఖ్యంగా మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీ స్థాపించి బరిలోకి దిగిన కమల్‌హాసన్‌కు ఈ ఫలితాలు ఊహించని షాక్ ఇచ్చాయి. పార్టీ అధినేత, స్టార్ నటుడిగా ఉన్న కమల్ హాసనే గెలవలేకపోయారు. దీంతోపాటు ఆయన పార్టీ అభ్యర్థులంతా కూడా ఓడిపోయారు. ఎంఎన్‌ఎం పార్టీ సత్తా చాటలేకపోయింది. ఇక ఖుష్బూను కూడా తమిళ ప్రజలు ఓడించారు.
సినీనటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ తన సతీమణి ప్రేమలతను విరుదాచలం నుంచి పోటీ చేయించగా ఆమె పరాజయం పొందారు. సినీ నటుడు, దర్శకుడు, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ ఈ ఎన్నికల్లో తిరువొత్తియూరు నుంచి ఓడిపోయారు. నటి కుష్బు చెన్నై థౌజండ్ లైట్స్ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. చెపాక్ నుంచి పోటీచేసిన ఉదయనిధి స్టాలిన్ గెలుపొందాడు. ఈ విధంగా తమిళ ఓటర్లు సినీ పరిశ్రమకు చెందినవారిని విశ్వసించలేదు. ఇక రాజకీయాల్లోకి వస్తానని.. తర్వాత అనారోగ్యంతో దూరమైపోయిన రజనీకాంత్‌కు ఇదే పరిస్థితి ఉండేదని విశ్లేషకులు చెబుతున్నారు.
చదవండి: ‘వ్యవస్థ కాదు.. ప్రధాని మోదీ ఓడిపోయాడు’
Comments
Please login to add a commentAdd a comment