సాక్షి,హైదరాబాద్: గుజరాత్‌లో పార్టీ అఖండ విజయం సాధించిన దరిమిలా ఇక తెలంగాణలో అధికార సాధనే తమ తదుపరి లక్ష్యమని బీజేపీ అధినాయకత్వం అధికారికంగా ప్రకటించనుంది. టీఆర్‌ఎస్.. బీఆర్‌ఎస్‌గా అధికారికంగా మారిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ కీలక ప్రకటన చేయనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ‘ప్రజాసంగ్రామయాత్ర’ముగింపు సందర్భంగా ఈ నెల 15న కరీంనగర్‌లో జరగనున్న బహిరంగసభలో నడ్డా, జాతీయ ప్రధానకార్యదర్శి తరుణ్ చుగ్ పాల్గొంటున్న సంగతి తెలిసిందే.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ విచారించడం, బీఆర్‌ఎస్ ప్రకటన, ఢిల్లీలో బీఆర్‌ఎస్ కార్యాలయం ప్రారంభం, ఎమ్మెల్యేల ఎర ఆరోపణల కేసులో నోటీసులు.. వంటి పరిణామాల నేపథ్యంలో ఈ సభ జరగడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. కరీంనగర్ బహిరంగసభలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరశంఖాన్ని నడ్డా పూరించనున్నట్టు పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం.
నాలుగు విడతలకు భిన్నంగా...
ఇప్పటిదాకా నాలుగు విడతలుగా సాగిన పాదయాత్రల సందర్భంగా నిర్వహించిన సభల కంటే కూడా కరీంనగర్‌సభ ను రాష్ట్ర పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ స్థానం పరిధిలో ఇది ముగుస్తుండడంతో దీనిని దిగి్వజయంగా జరపాలని నిర్ణయించింది. అదీగాక ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కిన తరుణంలో దీనిని విజయవంతం చేయడం ద్వారా ప్రజలకు గట్టి సంకేతం పంపాలని భావిస్తోంది.
హైదరాబాద్ పరిధిలో ఆరో విడత...
ఐదో విడత పాదయాత్ర ముగియగానే హైదరాబాద్ మహానగరం పరిధిలో కొన్నిరోజుల విరామంతోనే ఆరోవిడత పాదయాత్ర చేపట్టాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలుంటే వెను వెంటనే 25 నుంచి 30 రోజుల్లో పాదయాత్ర కవర్ కాని అసెంబ్లీ నియోజకవర్గాలు చుట్టివచ్చేలా బస్సుయాత్ర చేపట్టాలని నిర్ణయించింది. ముందస్తు ఎన్నికలు రాని పక్షంలో ముందు నిర్ణయించిన మేరకు మిగతా విడతల ప్రజాసంగ్రామయాత్రలను చేపట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment