ఉప్పలగుప్తంలో కంచాలు వాయిస్తున్న జనసేన వీర మహిళలు
కూటమిలో ఎగసిపడుతున్న సీట్ల చిచ్చు.. టీడీపీ, జనసేన, బీజేపీలకు నిరసన సెగ
రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కుతున్న పార్టీల శ్రేణులు
తలలు పట్టుకుంటున్న అధిష్టానవర్గాలు
సత్యవేడు(తిరుపతి జిల్లా)/మదనపల్లె/ఉప్పలగుప్తం/డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ)/కపిలేశ్వరపురం(మండపేట)/కందుకూరు/సాక్షి,అమలాపురం: మండుతున్న ఎండలకు తోడు ఎన్డీఏ కూటమిలో సీట్ల చిచ్చు ఎగసిపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ పార్టీ శ్రేణుల నుంచి టీడీపీ, జనసేన, బీజేపీలకు నిరసన సెగ తగులుతోంది. కార్యకర్తలు రోడ్డెక్కి మరీ అధిష్టానాల తీరును ఎండగడుతున్నారు. ఏం చేయాలో పాలుపోక ఆయా పార్టీలు కిందామీదా పడుతున్నాయి. తిరుపతి జిల్లా సత్యవేడు అసెంబ్లీస్థానంలో టీడీపీ అభ్యర్థిగా కోనేటి ఆదిమూలంను తమపై రుద్దవద్దని తెలుగు తమ్ముళ్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం సత్యవేడులోని బేరిశెట్టి కల్యాణ వేదికలో సమావేశం పెట్టి మరీ అభ్యర్థిని మార్చాలని అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. తమను ఐదేళ్లపాటు ఇబ్బంది పెట్టిన ఆదిమూలంతో కలిసి పనిచేయలేమని తెగేసిచెప్పారు.
► అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలో కూటమి ఉమ్మడి అభ్యర్థిగా ఏడాదిక్రితం టీడీపీలో చేరిన వ్యక్తికి ఇవ్వడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి ఆనంద్ నాయకత్వంలో అంకిశెట్టిపల్లె పంచాయతీ శివనగర్‌లోని ఆయన స్వగృహంలో టీడీపీ, బీజేపీ, జనసేన ప్రధాన నాయకులంతా సోమవారం రహస్యంగా సమావేశమయ్యారు. మెజార్టీ వర్గాలను కాదని మైనార్టీకి సీటు ఇవ్వడం తగదని పేర్కొన్నారు. తమలో ఎవరు ఒకరం పోటీలో ఉంటామని స్పష్టం చేశారు. సమావేశంలో టీడీపీ ఇన్‌చార్జ్ దొమ్మలపాటి రమేష్, జనసేన రాయలసీమ కో–కనీ్వనర్ గంగారపు రాందాస్‌చౌదరి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు భగవాన్ పాల్గొన్నారు.
► విశాఖ దక్షిణం జనసేనలో సీటు చిచ్చురేగింది. పార్టీ ప్రకటించకుండా తానే అభ్యర్థినని ప్రచారం చేసుకుంటున్న వంశీకృష్ణ శ్రీనివాస్‌పై 39వ వార్డు కార్పొరేటర్ మహ్మద్ సాధిక్, దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకుడు డాక్టర్ మూగి శ్రీనివాస్ మండిపడ్డారు. సోమవారం వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రజల్లో ఉన్న నాయకులకు పార్టీ అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వంశీకృష్ణ ఎమ్మెల్యే అభ్యర్థిగా పనికిరారని, స్థానికేతరులను ప్రజలు ఆదరించరని స్పష్టం చేశారు. కార్పొరేటర్లు సాధిక్, కందుల నాగరాజు, మత్స్యకార నాయకుడు డాక్టర్ మూగి శ్రీనివాస్‌లో ఎవరికైనా టికెట్ ఇవ్వాలని కోరారు.
► అమలాపురం అసెంబ్లీ సీటును పొత్తుల్లో భాగంగా టీడీపీకి కేటాయిస్తారనే ప్రచారం జరగడంతో జనసేన నాయకులు, మహిళా కార్యకర్తలు సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. గొల్లవిల్లి, ఉప్పలగుప్తం ప్రధాన సెంటర్లలో కంచాలపై గరిటెలు మోగిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. టీడీపీకి కేటాయిస్తే తాము సహకరించబోమని హెచ్చరించారు.
► డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో 43 గ్రామాలు ఉండగా.. దాదాపు 30 గ్రామాల్లో జనసేన, టీడీపీ మధ్య విభేదాలున్నాయని జనసేన ఇన్‌చార్జి వేగుళ్ల లీలాకృష్ణ పేర్కొన్నారు. మండపేటలోని పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ఇన్నాళ్లూ పార్టీ కోసం పనిచేసిన తమకు సరైన ప్రాధాన్యం ఇస్తామని పవన్ నుంచి స్పష్టమైన హామీ వస్తేనే టీడీపీకి సహకరిస్తామని స్పష్టం చేశారు. లీలాకృష్ణకు ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇస్తామని హామీ ఇవ్వాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు.
► కందుకూరు టికెట్‌ను టీడీపీ ఇంటూరి నాగేశ్వరరావుకు కేటాయించడంతో ఆ పార్టీ అసమ్మతి నేత ఇంటూరి రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆత్మీయ సమావేశం పేరుతో బలప్రదర్శనకు దిగారు. పార్టీ కష్టకాలంలో ఉండగా అండగా నిలిచానని, పంచాయతీ ఎన్నికల్లో పోటీకి ఎవరూ ముందుకు రాకపోతే తాను అండదండలు అందించి అభ్యర్థులను నిలబెట్టానని పేర్కొన్నారు. టికెట్ విషయంలో అధిష్టానం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. ఇంటింటి ప్రచారం చేపట్టి తన బలమేమిటో పార్టీ అధిష్టానానికి చూపిస్తానని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యేలు పోతుల రామారావు, శివరాంల మద్దతూ తనకే ఉందని రాజేష్ బహిరంగంగా ప్రకటించడం గమనార్హం.
మిత్రపక్షాల్లో అసహనం
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం లోక్ సభ స్థానానికి అభ్యర్థి ఎవరనే విషయాన్ని టీడీపీ తేల్చడం లేదు. ఇది తేలితేనే కానీ అమలాపురం, పి.గన్నవరం అసెంబ్లీ స్థానాలపై స్పష్టత రానుంది. దీంతో మిత్రపక్షాల్లో అసహనం వ్యక్తమవుతోంది. అమలాపురం ఎంపీ స్థానాన్ని జీఎంసీ బాలయోగి కుమారుడు గంటి హరీష్ ఆశిస్తున్నారు. ఆయన స్థితిమంతుడు కాదనే నెపంతో అసెంబ్లీకి పంపించాలని బాబు యోచిస్తున్నారు. దీనికి హరీష్ ఒప్పుకోవడం లేదు. ఎంపీగా కొత్తగా పార్టీలో చేరిన పాము సత్యశ్రీ లేదా గుంటూరుకు చెందిన పారిశ్రామికవేత్త రమేష్ ప్రసాద్‌లలో ఒకరిని ఎంపిక చేయాలని పార్టీ తలుస్తోంది. హరీష్‌ను పి.గన్నవరం, అమలాపురం అసెంబ్లీ స్థానాల్లో ఒకదానికి పంపాలని చూస్తోంది. పి.గన్నవరానికి టీడీపీ అభ్యర్థిగా మహాసేన రాజేష్‌ను తొలి జాబితాలోనే ప్రకటించినా సర్వత్రా వ్యతిరేకత రావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ సీటు ఆశిస్తున్న బీజేపీ తన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమాను దాదాపుగా ఎంపిక చేసింది. అమలాపురం సీటు ఆశిస్తున్న జనసేన శెట్టిబతుల రాజబాబు, డీఎంఆర్ శేఖర్‌లలో ఒకరిని బరిలో దింపాలని భావిస్తోంది. అయితే టీడీపీ అమలాపురం అసెంబ్లీ నుంచి హరీష్‌ను బరిలో దింపాలని చూస్తుందనే ప్రచారంతో జనసేన శ్రేణుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment