సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం, జనసేన పార్టీల చీకటి పొత్తు రాజకీయం పరిషత్ ఎన్నికల సాక్షిగా బట్టబయలైంది. ఆచంట మండలంలో టీడీపీ అభ్యర్థికి మండల పరిషత్ ఎన్నికల్లో జనసేన మద్దతిచ్చింది. మరోవైపు వీరవాసరంలో జనసేన మెజారిటీ స్థానాల్లో గెలుపొందినా.. తక్కువ స్థానాల్లోనే గెలుపొందిన టీడీపీకి ఎంపీపీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వడం గమనార్హం. ఈ రెండు మండలాల్లోనూ ఈ అపవిత్ర పొత్తు ద్వారా టీడీపీ ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకోగా.. జనసేన మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవులతో సరిపెట్టుకుంది. మరోపక్క దీనిపై జిల్లాలోని జనసేన పార్టీకి చెందిన ఒక వర్గంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
సోమవారం జిల్లాలో మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు. ఆచంట మండలంలో 17 ఎంపీటీసీ స్థానాలకు గాను టీడీపీ 7, వైఎస్సార్‌సీపీ 6, జనసేన 4 స్థానాల్లో విజయం సాధించాయి. జెడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ దక్కించుకుంది. ఇక్కడ ఎంపీపీ ఎన్నికకు 9 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా, జనసేనకు చెందిన నలుగురు సభ్యులు టీడీపీకి మద్దతు ఇవ్వడంతో ఎంపీపీ స్థానాన్ని ఆ పార్టీ దక్కించుకుంది. ఇక్కడ వైస్ చైర్మన్ పదవిని జనసేనకు ఇచ్చారు. దీనిపై జనసేనలోని మండల స్థాయి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక వీరవాసరం మండలంలో సీన్ రివర్స్‌గా ఉంది. జెడ్పీటీసీ స్థానంతో పాటు మెజార్టీ ఎంపీటీసీల్లో జనసేన గెలుపొందినా ఎంపీపీ స్థానాన్ని మాత్రం టీడీపీకి కట్టబెట్టింది. వీరవాసరం మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలకు గాను 8 జనసేన, 7 వైఎస్సార్‌సీపీ, 4 టీడీపీ గెలుపొందాయి. జనసేన, టీడీపీకి చెరొక ఓటు అంటూ ఆ రెండు పార్టీలు ముందస్తు ప్రచారం చేసుకున్నాయి. దీనిలో భాగంగా 4 ఎంపీటీసీ స్థానాలు మాత్రమే ఉన్న టీడీపీకి ఎంపీపీ స్థానం కట్టబెట్టడం గమనార్హం. 8 ఎంపీటీసీలున్న జనసేన వైస్ చైర్మన్ పదవితో సరిపెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment