జగ్గయ్యపేట అర్బన్: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో తెలుగుదేశం కార్యకర్తలు రెచ్చిపోయారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కాన్వాయ్‌కు దారి ఇవ్వకుండా కారు వెనుక అద్దాలను కొడుతూ కవ్వింపు చర్యలకు దిగారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. అసలేం జరిగిందంటే.. ఆదివారం మధ్యాహ్నం ఎమ్మెల్యే ఉదయభాను బలుసుపాడు రోడ్డులోని టిడ్కో గృహాల వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి జగ్గయ్యపేటకు తిరిగి వస్తుండగా పట్టణంలోని పెద్ద సెంటర్‌లో టీడీపీ కార్యకర్తలు దళిత ఆత్మీయ సమ్మేళనం పేరుతో ర్యాలీగా వస్తూ ఎదురుపడ్డారు. ఈ సమయంలో ఎమ్మెల్యే కాన్వాయ్‌కు దారి ఇవ్వకుండా టీడీపీ జెండాలు ఊపుతూ కవ్వింపు చర్యలకు దిగారు.
ఎమ్మెల్యే కారు వెనుక అద్దాలను కొడుతూ టీడీపీ జిందాబాద్ అంటూ పెద్దగా నినాదాలు చేశారు. ఆ సమయంలో ఎమ్మెల్యే ఉదయభాను వెంట సుమారు 15 మంది కార్యకర్తలు ఉండగా, టీడీపీ వారు వందలాది మంది ఉన్నారు. టీడీపీ కార్యకర్తల కవ్వింపు చర్యలకు ప్రతిగా ఓ వైఎస్సార్ సీపీ కార్యకర్త తమ జెండా ఊపడంతో ఆగ్రహించిన తెలుగు తమ్ముళ్లు అతనిపై దాడికి తెగబడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. పోలీసులు రంగంలోకి దిగి వైఎస్సార్ సీపీ కార్యకర్తలను పాత మునిసిపల్ కార్యాలయం ఆవరణలో ఉంచి గేట్లు వేశారు. అయినా టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వుతూ వీరంగం సృష్టించారు.
కొన్ని రాళ్లు పోలీసులు, విలేకరులకు కూడా తగిలాయి. కనిపించిన చోటల్లా వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. పోలీసులు ఆందోళనకారులను నియంత్రించి పరిస్థితిని చక్కదిద్దారు. నందిగామ ఏసీపీ డాక్టర్ బి.రవికిరణ్ వచ్చి బందోబస్తును పర్యవేక్షించారు. ముఖ్య కూడళ్ల వద్ద పికెట్లు ఏర్పాటు చేశారు. సాయంత్రం వీధుల్లో కవాతు నిర్వహించారు. శాంతియుతంగా వస్తున్న తమ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారని, కొందరిని గాయపరిచారని, వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు వైఎస్సార్ సీపీ జగ్గయ్యపేట పట్టణ అధ్యక్షుడు ఆకుల శ్రీకాంత్, మున్సిపల్ వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment