ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గాంభీర్య ప్రదర్శన ఎంత ఆసక్తికరంగా ఉంటుందో గమనించండి. ఒక చిన్న అవకాశం వచ్చినా, మొత్తం కథ అంతా తనవైపే తిప్పుకోవడానికి ఆయన చేసే విన్యాసాలు చూడండి. ఒకవైపు అసెంబ్లీలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.370 కోట్ల స్కిల్ స్కామ్, మరో వైపు దానిని కప్పిపుచ్చుతూ చంద్రబాబు చేసే ప్రయత్నాలు. ఇలాంటి వ్యూహాలలో దిట్టే. అందులో సందేహం లేదు.
ఇంతకీ ఏమిటి ఆయన చెప్పింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ గెలిచింది కాబట్టి ఇక వైఎస్సార్‌సీపీ పని, ముఖ్యమంత్రి జగన్ పని అయిపోయిందని ఆయన అంటారు. ఇక రెగ్యులర్ గా చేసే దూషణలను మరోసారి వినిపిస్తారు. అదే టైమ్ లో జగన్ విసిరే సవాల్‌కు సమాధానం చెప్పరు. పోని తన టైమ్‌లో జరిగిన స్కిల్ స్కామ్‌లో తన పాత్రపై వచ్చిన అభియోగాల గురించి మాట్లాడుతారా అంటే అది చేయరు. కాకపోతే టీడీపీ మీడియా ఈనాడు, ఆంద్రజ్యోతి ,టీవీ 5 వంటివి ఉన్నాయి కనుక ఊదరగొడతారు. వాటిని వారు బ్రహ్మాండంగా మొదటి పేజీలలో అచ్చేసి ప్రచారం చేస్తారు. వారి టీవీలలో గంటల కొద్ది ప్రసారం చేస్తారు.
ఈ రకమైన ప్రచారంతోనే వారు ఏపీ ప్రజలను ప్రభావితం చేయాలన్న ధృఢ సంకల్పంతో ఉన్నట్లు అర్థం అవుతూనే ఉంది. జగన్ చేపట్టిన స్కీములు, తీసుకువచ్చిన సంస్కరణలు, పేద ప్రజలకు జరిగిన మేలు, ఎన్నికల హామీలను జగన్ అమలు చేసిన వైనం వంటివాటి జోలికి వెళితే తమ డొల్లతనం బయటపడుతుందని వారికి తెలుసు. అందుకే వాటిని జనం మర్చిపోయేలా చేయాలన్న ధ్యేయంతో చంద్రబాబుకానీ, ఈనాడు తదితర టీడీపీ మీడియా సంస్థలు కానీ నిత్యం పనిచేస్తుంటాయి. చంద్రబాబు తన మీడియా సమావేశంలో చేసిన ప్రకటన చూస్తే అసలు ఏపీలో ఇప్పటికే ఆయన ప్రభుత్వం వచ్చేసిందేమో అన్న సంశయం కలుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలలో వచ్చిన తిరుగుబాటుగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అని ఆయన వర్ణించారు. ఈనాడు పట్టభద్రుల తిరుగుబాటు అని హెడింగ్ పెడితే, దానిని అనుసరిస్తూ కొద్దిగా మార్పుతో ప్రజల తిరుగుబాటు అని చంద్రబాబు అన్నారు. అలాగే ఈనాడు రాసిన వార్తలను బట్టి చంద్రబాబు పలు అంశాలను మాట్లాడారని ఇట్టే తెలిసిపోతుంది. కాకపోతే మధ్యలో అంబేద్కర్ కొటేషన్ వంటివి చెప్పి, తమది చాలా స్వచ్చమైన రాజకీయం అన్నట్లు, వైఎస్సార్‌సీపీది అంతా అరాచకం అన్నట్లు చిత్రించడానికి చంద్రబాబు చేయని కృషి లేదు.
మూడు ఎమ్మెల్సీ స్థానాలలో ఓడిపోతేనే టీడీపీ అధికారంలోకి వచ్చేస్తుందా? మరి రెండు టీచర్ల ఎమ్మెల్సీ స్థానాలలో వైఎస్సార్‌సీపీ గెలిచింది కదా అన్నదానికి ఆయన సమాధానం ఇవ్వరు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో మొత్తం వైఎస్సార్‌సీపీ గెలిచింది కదా అంటే అది పెద్ద విషయం కాదన్నట్లు ప్రస్తావించరు. వైసీపీ ఓటమి ప్రజల తిరుగుబాటు అయితే కుప్పంలో మొత్తం మున్సిపాల్టీతో సహా స్థానిక ఎన్నికలన్నిటిలో వైసీపీ స్వీప్ చేసింది కదా.. దానిని చంద్రబాబు కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినట్లు ఒప్పుకుంటారా? అంటే అబ్బే అవేమీ లెక్కలో వేయరు. గాలికి వచ్చిన పార్టీ గాలికే పోతుందని మరో వ్యాఖ్య చేశారు. గతంలో కేసీఆర్ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని పెట్టినప్పుడు కూడా చంద్రబాబు ఇలాగే మఘలో పుట్టి పుభలో పోతుందని వ్యాఖ్యానించారు. కానీ అది ఇంతితై, వటుడింతై అన్నట్లుగా రాజ్యాధికారాన్ని చేపట్టి , తెలంగాణ నుంచి చంద్రబాబును తరిమేసినంత పనిచేసిందన్న సంగతి గుర్తుంచుకోవాలి. అంతేకాదు. టీడీపీని తనదారిలోకి తెచ్చుకుని చంద్రబాబు మెడలు వంచి తెలంగాణకు అనుకూలంగా తీర్మానాన్ని కేసీఆర్ చేయించుకోగలిగారు.
అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ ను జగన్ స్థాపించినప్పుడు దానిని ఎలాగొలా అణచివేయాలని కాంగ్రెస్ తో కలిసి చేయని కుట్ర లేదు. అయినా జగన్ మొండిగా ధైర్యంగా ముందుకు వెళ్లి అధికారం చేపట్టారు. ఇప్పుడు ఆయనను ఎదుర్కోవడమే టీడీపీకి ఛాలెంజ్‌గా మారింది. ఆయన ఎన్నికల మేనిఫెస్టోని అమలు చేస్తుండడంతో ప్రజల మనసులను డైవర్ట్ చేయడానికి టీడీపీ కానీ, ఈనాడు వంటి మీడియా కానీ పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. ఇన్ని కబుర్లు చెప్పిన పెద్దమనిషి చంద్రబాబు ఇంతకీ తాను ఒంటరిగా పోటీచేసి అధికారంలోకి వస్తానని చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉండడమే హైలైట్ అని చెప్పాలి. టీడీపీ అధికారంలోకి రాబోతోందని బీరాలు పలకడం బాగానే ఉన్నా,అది ఎలా అన్నదానికి బదులు ఇవ్వరు.
అదే ముఖ్యమంత్రి జగన్ అయితే తిరువూరు సభలో చాలా స్పష్టంగా ఏమన్నారో పరిశీలించండి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజలకు మేలు చేయడం లేదని అంటున్న తెలుగుదేశం తాను ఒంటరిగా అన్ని సీట్లకు పోటీచేసి గెలుస్తానని చెప్పలేకపోతోందని ఎద్దేవా చేశారు. ఎన్ని తోడేళ్లు ఒకటైనా తాను మాత్రం ఒంటరిగానే ఎన్నికలకు వెళతానని జగన్ ధైర్యంగా చెబుతున్నారు. దుష్టచతుష్టయం, దత్తపుత్రుడి గురించి ప్రస్తావించి ఎవరెన్ని కుట్రలు చేసినా తాను ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తానని ఆయన ధీమాగా అంటున్నారు. ఆ సాహసం చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నారంటే , జనంలో తనను నమ్మడం లేదన్న భయం ఉండడం వల్లే అని తెలుసుకోవచ్చు.
ఈ గ్రాడ్యుయేట్ల ఎన్నికలలో కూడా టీడీపీకి వామపక్షాలు మద్దతు ఇవ్వడం బహిరంగ రహస్యం. పేదలకు అండగా ఉంటున్న జగన్ ను కాదని, పెట్టుబడిదారీ వ్యవస్థలకు ప్రతీకగా మారిన టీడీపీకి సీపీఐ, సీపీఎం వంటి పార్టీలు జైగొట్టే దుస్థితిలో పడ్డాయి. అది వేరే సంగతి అయినా ఈ ఎన్నికలు పార్టీల ప్రాతిపదికన జరగలేదు. కాకపోతే వైఎస్సార్‌సీపీ, టీడీపీ అభ్యర్ధులను ప్రకటించడంతో అవి రాజకీయం రంగు పులుముకున్నట్లయింది. నాలుగేళ్లుగా ఒక్క ఎన్నికలో గెలవలేకపోయిన టీడీపీకి ఈ గ్రాడ్యుయేట్ల ఎన్నికలు కాస్త ఊరట ఇచ్చి ఉండవచ్చు. అంతమాత్రాన అధికారంలోకి వచ్చేశామని హోరెత్తిస్తే జనం అంతా మారిపోతారన్నది వారి వ్యూహం.
అదే టైమ్‌లో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో చంద్రబాబు పాత్రను మంత్రి బుగ్గన డిటైల్డ్‌గా వివరించారు. దానిని కప్పిపుచ్చడానికి చంద్రబాబు మీడియా సమావేశం పెట్టి ఎన్నికల ఫలితాల గురించి ప్రసంగించారు. ఆయనకు తోడుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టీడీపీ మీడియా ఆ స్కామ్ అప్రాధాన్య అంశం అన్నట్లుగా నటిస్తున్నాయి. మరో సంగతి చెప్పాలి. మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థలో జరిగిన అక్రమాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇంతవరకు అధికారికంగా స్పందించలేకపోయింది. కానీ చంద్రబాబు పరోక్షంగా మాట్లాడుతూ ,కొందరు ఆరేడు దశాబ్దాలుగా తమ బ్రాండ్ ను రుజువుచేసుకున్నారని, ప్రజల ప్రయోజనాలే పరమావధిగా పనిచేశారని, గౌరవంగా బతికేవారిని రోడ్డుమీదకు జగన్ తెచ్చారంటూ వ్యాఖ్యానించారు.
అంతే తప్ప ధైర్యంగా మార్గదర్శిలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఆయన ఎందుకు చెప్పలేకపోయారు? తన హయాంలో పత్రికా స్వేచ్చ బ్రహ్మాండంగా ఉన్నట్లు అసత్యాలు చెబుతున్నారు. ఆ రోజుల్లో సాక్షి టీవీని కనిపించకుండా ఆయన ఎన్ని ప్రయత్నాలు చేశారో, సాక్షి పత్రికను ఎన్ని రకాలుగా వేధించారో ప్రజలకు తెలియదని ఆయన అనుకుంటున్నారు. సాక్షి తో పాటు మరికొన్ని మీడియా సంస్థలపై చంద్రబాబు టైమ్ లో బ్యాన్ కూడా అనధికారికంగా విధించారు. ఇప్పుడేమో ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్చ అంటూ నంగనాచి కబుర్లు చెబుతున్నారు. అదే చంద్రబాబు గొప్పతనం అని ఒప్పుకోవాలి. నిజంగానే చంద్రబాబుకు తన పార్టీ విజయంపై అంత నమ్మకం కుదిరితే, జగన్ సవాల్ కు స్పందించి టీడీపీ ఒంటరిగా పోటీచేస్తుందని చెప్పగలరా?
-కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్
చదవండి: రెండు సీట్లకు ఎగిరి గంతేయడమే టీడీపీ స్టైల్!
Comments
Please login to add a commentAdd a comment