
సోషల్ మీడియాలో వీడియో వైరల్
పరువుపోయిందని తలలు పట్టుకుంటున్న తమ్ముళ్లు
చిత్తూరు అర్బన్: చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్‌మోహన్ నాయుడు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో అభాసుపాలవుతున్నారు. ఇటీవల ఓ బైకు నడిపిన ఆయన రెండు చేతులు వదిలేస్తూ.. జాతీయ రహదారిపై చేసిన స్టంట్లు, దాన్ని వీడియోలు తీయించి వైరల్ చేసిన తీరు చూసి జనం నవ్వుకున్నారు. దీనిపై యువత తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోవడం, హెల్మెట్ పెట్టుకోకపోవడం, కనీసం రోడ్డుపై స్టంట్లు చేసేప్పుడు పోలీసుల అనుమతి తీసుకోవాలనే అవగాహనలేకపోవడం ఏంటని విద్యావంతుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వివాదం నుంచి బయటపడకముందే తాజాగా ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇందులో జగన్‌మోహన్ నాయుడు రికార్డింగ్ డ్యాన్సు చూస్తూ కనిపించారు.
ఇద్దరు యువతులతో కలిసి ఆయన వేసిన కుప్పి గంతులు చూపరులకు వెగటుపుట్టస్తున్నాయి. బెంగళూరులో డిస్కోలు, పబ్బులు, మద్యం బార్లలో పిచ్చి గంతులు వేసే వ్యక్తి, బాధ్యతారహితంగా వ్యవహరించే మనిషి నాయకుడైతే ఎలా ఉంటుందో తెలుసుకోండి..! అంటూ పలువురు ఈ వీడియోలను ట్రోల్ చేశారు. సైకిల్ పోవాలి అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఈ వీడియో వైరల్ కావడంతో టీడీపీ కార్యకర్తలు అంతర్మథనంలో పడ్డారు. తమ అభ్యర్థి నిర్వాకాలతో పార్టీ పరువు బజారున పడిందని తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు. భవిష్యత్‌లో సదరు అభ్యర్థి ఇంకేం వీడియోలతో నవ్వులపాలు చేస్తాడో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment