కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి
సాక్షి ప్రతినిధి, కర్నూలు: నామినేటెడ్ పోస్టులు, ఇతరత్రా వ్యవహారాల్లో అధికార తెలుగుదేశం పార్టీ నేతల లంచాల బాగోతాన్ని ఆ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డే బయటపెట్టారు. జిల్లాలో కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు ప్రతి పదవినీ అమ్ముకుంటున్నారని చెప్పారు. తిక్కారెడ్డి వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్‌టీ రామారావు వర్ధంతి సందర్భంగా కర్నూలులోని పార్టీ కార్యాలయంలో ఆయన సొంత పార్టీ నేతల లంచగొండితనాన్ని వెల్లడించారు. డీలర్‌షిప్‌లు, గ్రామాల్లో పోస్టులకు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు లంచాలు తీసుకుంటున్నారని చెప్పారు.
టీడీపీ కార్యకర్తల దగ్గరే ఇలా లంచాలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కురబ సామాజిక వర్గానికి చెందిన ఓ సాధారణ ఎంపీటీసీ బస్తిపాటి నాగరాజును చంద్రబాబు ఎంపీని చేశారని, ఆయన గ్రామంలో ఓ పోస్టు విషయంలో జోక్యం చేసుకుంటే అక్కడి ఎమ్మెల్యే, ఇన్‌చార్జి అడ్డుపడ్డారన్నారు. పదవులు ఇచ్చేందుకు ఆయన ఎవరంటూ ఎంపీనే ధిక్కరించారని చెప్పారు. ఎంపీ చెప్పిన వారికి కాకుండా లంచాలు ఇచ్చేవారికి పదవులు ఇస్తారా అని ప్రశ్నించారు.
ఎంపీ నాగరాజు కోడుమూరు నియోజకవర్గం పంచలింగాల వాసి. దీన్నిబట్టి చూస్తూ తిక్కారెడ్డి అక్కడి ఎమ్మెల్యే దస్తగిరి, ఇన్‌చార్జి ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డిపై పరోక్షంగా ఆరోపణలు చేశారని స్పష్టమవుతోంది. జిల్లాలో ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిల అవినీతి వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళతానని తిక్కారెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment