సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్లస్థలాలు దక్కకుండా చేసేందుకు సర్వశక్తులు ఒడ్డి విఫలమైన తెలుగుదేశం పార్టీ పెద్దలు ఇప్పుడు మరోసారి ఆ పేదలను లక్ష్యంగా చేసుకున్నారు. రాజధాని ప్రాంతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మంజూరు చేసిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు పేదలు సిద్ధమవుతున్న తరుణంలో.. అడ్డుకునేందుకు మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయించారు.
ప్రభుత్వం మంజూరు చేసిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని కోరుతూ తమకు అనుకూలురైన వారిచేత పిటిషన్ వేయించారు. ఇందులో ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని వ్యక్తిగత హోదా లో ప్రతివాదిగా చేర్పించి, ఆయనపై పలు నిందారోపణలు చేయించారు. ఈ పిటిషన్‌పై బుధవారం న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ ప్రతాప వెంకటజ్యోతిర్మయి ధర్మాసనం విచారించింది.
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మినహా మిగిలిన ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర గృహనిర్మాణ శాఖ డిప్యూటీ కార్యదర్శి, ఏపీ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీసీఆర్‌డీఏ కమిషనర్, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్, భూ కేటాయింపు కమిటీ, గుంటూరు, ఎన్‌టీఆర్ జిల్లాల కలెక్టర్లతో పాటు వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా ఉన్న పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మికి నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వీరిని ఆదేశించింది.
చదవండి: చంద్రబాబు, లోకేష్‌లకు భారీ షాక్...
అలాగే రాజధాని ప్రాంతంలో పేదల కోసం ఏర్పాటు చేసిన ఆర్ 5 జోన్‌లో పేదలకు ఇళ్లపట్టాల పంపిణీకి మాత్రమే సుప్రీంకోర్టు అనుమతినిచ్చిందా? లేక ఆ స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి కూడా అనుమతినిచ్చిందా? పంపిణీ చేసిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు కూడా అనుమతినిచ్చిందా? అన్న విషయంలో స్పష్టతనివ్వాలని ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని ధర్మాసనం ఆదేశించింది. విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది.
అప్పుడు అలా..
రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని సీఆర్‌డీఏ చట్ట నిబంధనలు చెబుతున్నా.. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతో చట్ట నిబంధనలను అమలు చేసేందుకు సిద్ధమైన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో 1,402 ఎకరాల్లో పేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు ఏకంగా ఆర్ 5 జోన్‌ను సృష్టించింది. పేదల కోసం ఆ భూములను సీఆర్‌డీఏ నుంచి కొనుగోలు చేసింది. ఈ భూముల్లో 50,793 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. తమ ప్రాంతంలో పేదలు ఉండకూడదన్న ఉద్దేశంతో వారికి పట్టాలు రాకుండా చేసేందుకు తెలుగుదేశం పార్టీ పెద్దలు సర్వశక్తులు ఒడ్డారు.
హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. కోట్ల రూపాయలు వెచ్చించి సీనియర్ న్యాయవాదులను రంగంలోకి దించారు. అయినా కూడా టీడీపీ ప్రయత్నాలు ఫలించలేదు. పేదలకు ఇళ్లస్థలాల మంజూరు అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం నొక్కి చెప్పడంతో పట్టాల మంజూరుకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రభుత్వం విజయవంతంగా పేదలకు పట్టాలు పంపిణీ చేసింది. పేదలకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మంజూరు చేసిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు కేంద్రం అనుమతులు సైతం మంజూరు చేసింది. దీంతో ఖంగుతున్న టీడీపీ పెద్దలు ఇప్పుడు పేదల స్థలాల్లో చేపట్టబోతున్న ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.
ఇప్పుడు ఇలా..
ఇళ్ల నిర్మాణాలను అడ్డుకునేందుకు హైకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. గతంలో సవాలు చేసిన విధంగానే ఆర్ 5 జోన్ ఏర్పాటు కోసం తీసుకొచ్చిన సవరణ చట్టాన్ని, 1,402 ఎకరాల బదలాయింపు జీవోలను కూడా తాజా పిటిషన్‌లోను సవాలు చేశారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.
Comments
Please login to add a commentAdd a comment