న్యూఢిల్లీ, సాక్షి: ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోయాలనే భావదారిద్ర్యంలో కేసీఆర్ ఉన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర తాజా రాజకీయాలపై ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన గురువారం మధ్యాహ్నాం మీడియాతో మాట్లాడారు.
‘‘మాజీ సీఎం కేసీఆర్‌కు సిగ్గుండాలి. అసెంబ్లీకి రమ్మంటే రాడు. రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆహ్వానించినా రాడు. తన కుటుంబానికే అన్ని కావాలనే స్వార్థంలో ఉన్నారు. 64 సీట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మాది. ఆది కేసీఆర్ కుప్పకూలిపోతుందని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ బీజేపీతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయాలని అనుకోలేదా?. కాంగ్రెస్‌ను ఓడించాలనే బీఆర్‌ఎస్ ఓట్లను బీజేపీకి బదిలీ చేయించారు. సిరిసిల్ల, సిద్దిపేటలో బీజేపీకి అన్ని ఓట్లు పడ్డాయంటే అర్థమేంటి?.
పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతికత కేసీఆర్‌కు లేదు. ఎంతో మంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్న విషయం ఆయనకు గుర్తులేదా? ఫిరాయింపులకు పునాది వేసింది బీఆర్‌ఎస్. అమరవీరుల స్తూపం దగ్గర కేసీఆర్ ముక్కును నేలకు రాయాలి. ఇన్నాళ్లూ ఎమ్మెల్యేలను దగ్గరకు రానివ్వని కేసీఆర్ ఇప్పుడు ఫామ్‌హౌస్ తలుపులు తెరిచారు. మొన్నటిదాకా ఎమ్మెల్యేలను కలవడానికి ఇష్టపడని కేసీఆర్.. ఇవాళ ఇంటికి పిలిచి భోజనం పెడుతున్నారు విద్యుత్ కొనుగోళ్లపై విచారణ కోరింది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి. విచారణ కమిషన్ కేసీఆర్‌కు లేఖ రాయగానే విచారణ ‘ఎందుకు?’ అని ప్రశ్నిస్తున్నారు.
పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌తో ఎలాంటి సమస్యలు లేవు. ఏమైనా ఉంటే పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.
మంత్రి వర్గ విస్తరణపై చర్చించలేదు
అన్ని శాఖలకు సమర్థవంతులైన మంత్రులున్నారు. ఎలాంటి శాఖ ఖాళీ లేదు. మంత్రి వర్గ విస్తరణపై అధిష్టానంతో ఎలాంటి చర్చా జరపలేదు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా పని చేసి.. మంత్రులను కొన్ని నెలలపాటు పెట్టుకోలేదు. మా కేబినెట్‌లో అన్ని శాఖలకు సమర్థవంతమైన మంత్రులు ఉన్నారు. విద్యాశాఖ నా దగ్గరే ఉంది. ఏమైనా లోపాలు ఉన్నాయా?. ఇప్పటివరకు ఎన్నో సమీక్షలు చేశాను.
జీవన్‌రెడ్డి అలక ఎపిసోడ్ గురించి..
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసే ఎమ్మెల్యే సంజయ్ బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఈ పరిణామంతో జీవన్‌రెడ్డి కాస్త మనస్తాపానికి లోనయ్యారు. పీసీసీ వైపు నుంచి కొంత సమన్వయ లోపం కనిపించింది. అందువల్లే ఈ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. జీవన్‌రెడ్డి విషయంలో ఏమైనా జరిగితే బాగుండని గోతికాడ నక్కలు ఎదురు చూశాయి. కానీ, జీవన్‌రెడ్డికి కాంగ్రెస్‌పై ఆయనకున్న నిబద్ధతకు వాళ్లకు అర్థం కాదు. అధిష్టానం జీవన్‌రెడ్డి అనుభవం, నిబద్ధతను దృష్టిలో పెట్టుకుంది.జీవన్‌రెడ్డి గౌరవానికి భంగం కలగడని అధిష్టానం ఆహామీ ఇచ్చింది. సమయం, సందర్భం వచ్చినప్పుడు జీవన్‌రెడ్డి అనుభవాన్ని వినియోగించుకుంటాం.
తెలంగాణకు త్వరలో కొత్త పీసీసీ
కొత్త పీసీసీపై అధిష్టానంతో చర్చ జరిగింది. పీసీసీ చీఫ్ ను నియమించమని కోరా. ప్రస్తుతం నా పీసీసీ పదవి కాలం జులై 7వ తేదీతో ముగుస్తుంది. నా హయాంలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. పీసీసీ ఎంపిక విషయంలో తగిన న్యాయం జరగుతుందని భావిస్తున్నా.
బీఆర్‌ఎస్‌కు ఛాన్స్ ఇవ్వలేదు
ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో రాష్ట్రాభివృద్ధే మా ధ్యేయం. తెలంగాణ ప్రజలకు రాహుల్‌గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయబోతున్నాం. ఆనాడు సోనియా గాంధీ తెలంగాణ ఇస్తానని చెప్పి ఆ వాగ్దానాన్ని నెరవేర్చారు. రాష్ట్రంలో ఎలాంటి ఘటనలు జరగకుండా ఎన్నికలు పూర్తయ్యాయి. దానిపై విమర్శించడానికి బీఆర్‌ఎస్‌కు అవకాశం లేకుండా పోయింది. శాంతిభద్రతలను కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నాం.
కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రయత్నిస్తున్నాం. ఇందుకోసం త్వరలో ప్రధాని, కేంద్ర మంత్రుల్ని కలుస్తాం. పక్క రాష్ట్రంతో పునర్విభజన ప్రయోజనాల కోసం చర్చిస్తాం. ఇందుకోసం మంత్రివర్గ ఉపసంఘం వేస్తాం. తెలంగాణను రోల్ మోడల్ స్టేట్‌గా తీర్చి దిద్దుతాం. భేషజాలకు పోకుండా మా వంతు ప్రయత్నం మేం చేస్తున్నాం అని రేవంత్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment