సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్‌లో ఉంది. ఎన్నికల్లో ప్రజల నుంచి పూర్తి మద్దతు కనిపించడంతో ఇక లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై కసరత్తు ప్రారంభించింది. మరోవైపు.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ అంశాన్ని హైకమాండ్ పరిశీలిస్తోంది. దీంతో, ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే సస్పెన్స్ నెలకొంది.
అయితే, లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. తెలంగాణలో మెజార్టీ ఎలా సాధించాలన్న అంశంపై రేవంత్ టీమ్ దృష్టి సారించింది. ఈ క్రమంలో గెలుపు గుర్రాలు ఎవరు అనే అంశాలను పరిశీలిస్తోంది. 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల కోసం దృష్టిసారించింది. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని వారి పేర్లను కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇక, ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా పరిగణనలోకి తీసుకుని కసరత్తు చేస్తున్నారు. కాగా, సంక్రాంతికి అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశం ఉంది.
మల్కాజ్‌గిరి నుంచి సోనియా పోటీ..
ఇదిలా ఉండగా.. లోక్‌సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలులోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు.. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి అగ్రనేతలు బరిలో దిగనున్నారు. సీనియర్లు బరిలోకి దిగే ఛాన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఖమ్మం, నల్లగొండ, భువనగిరి, మహబూబ్‌నగర్ స్థానాలు కీలకంగా మారాయి. అయితే, కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ ఈసారి తెలంగాణ నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. సోనియాను మాల్కాజ్‌గిరి నుంచి పోటీ చేయించే ఆలోచనలో తెలంగాణ నేతలు ఉన్నట్టు సమాచారం. కాగా, సీఎం రేవంత్ మాల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే. ఈ కారణంతోనే సోనియాను ఇక్కడి నుంచే పోటీ చేయించే అవకాశముంది.
ఏపీ కాంగ్రెస్‌పై ఫోకస్..
మరోవైపు.. ఏపీలో టీడీపీని చేర్చుకుందామా? అనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు సమాచారం. ఇండియా కూటమిలో చేరేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు తహతహలాడుతున్నట్టు విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషిస్తున్న ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే చంద్రబాబుతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇక, ఈనెల 27వ తేదీన ఏఐసీసీ కీలక సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, పీసీసీ చీఫ్ రుద్రరాజు, కొత్త ఇన్‌ఛార్జ్ ఠాగూర్ సహా ముఖ్య నేతలు పాల్గొననున్నారు. ఈ సందర్బంగా ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వ్యూహాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment