సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ముందస్తు ఎన్నికలు కచ్చితంగా వస్తాయని, జమిలి ఎన్నికలకు కూడా చాన్స్ లేకపోలేదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నా ఎక్కడ పోటీ చేయాలన్న దానిపై ఆ పార్టీ నేతలకే స్పష్టత లేకుండా పోయింది. ముఖ్యంగా ఈసారి అసెంబ్లీకి పోటీచేయాలా లేక.. పార్లమెంటుకెళ్లాలా అన్న విషయంలో సీనియర్లు, జూనియర్లు సహా ఎవరూ తేల్చుకోలేకపోతున్నారు.
ప్రస్తుతం రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు ఎంపీలూ ఈసారి అసెంబ్లీకే సై అంటుండగా, ఆ మూడు చోట్లా పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులు కనిపించని పరిస్థితి. వీరితోపాటు గత ఎన్నికల్లో అసెంబ్లీకి, పార్లమెంటుకు పోటీచేసి ఓడిన చాలామంది నేతలు కూడా ఈసారి ఎక్కడ పోటీ చేయాలనే విషయంపై ఊగిసలాటలో ఉన్నారు.
రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకుగాను మెజార్టీ స్థానాల్లో ఇదే పరిస్థితి ఉండటం పార్టీని కలవరపాటుకు గురిచేస్తుండగా.. అసలు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కనీసం సమీక్షకు కూడా టీపీసీసీ నాయకత్వం ఇప్పటివరకు ఉపక్రమించకపోవడం గమనార్హం.
హైదరాబాద్, మహబూబాబాద్‌లో ఎలా?
మహబూబాబాద్ ఎంపీగా పోటీచేసిన మాజీ మంత్రి బలరాం నాయక్, హైదరాబాద్ ఎంపీ గాపోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలని యోచిస్తున్నారు. దీంతో మహబూబా బాద్, హైదరాబాద్ లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థిత్వాలపై అస్పష్టత నెలకొంది. వీరంతా మళ్లీ పార్లమెంటుకు వెళ్తారనే ఆశతో కొందరు ఆశావహులు ఆయా అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
అందరూ అసెంబ్లీకే మొగ్గు!
గత ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ ఈసారి కరీంనగర్ అసెంబ్లీకా, పార్లమెంటుకా అనేది తేల్చుకోలేకపోతున్నారు. నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ ఈసారి అసెంబ్లీ స్థానాన్ని వెతుక్కునే పనిలో బిజీగా ఉన్నారు. గత ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఓడిన తర్వాత మహబూబ్‌నగర్ ఎంపీగా పోటీ చేసిన వంశీచంద్‌రెడ్డి కూడా అసెంబ్లీకే ప్రాధాన్యమిస్తున్నారు. మెదక్ ఎంపీగా పోటీ చేసిన గాలి అనిల్‌కుమార్ నర్సాపూర్ అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్నారు.
నాగర్‌కర్నూల్ ఎంపీగా బరిలో ఉన్న మల్లురవి జడ్చర్ల అసెంబ్లీ అడుగుతారా? లేక ఎంపీగా పోటీ చేస్తారా అన్నదానిపైనా అస్పష్టతే. అంజన్‌కుమార్ యాదవ్ (సికింద్రాబాద్), రేణుకా చౌదరి (ఖమ్మం) కె.మదన్‌మోహన్ (జహీరాబాద్)లు మా త్రమే మళ్లీ పార్లమెంటుకైనా ఓకే అనే భావనలో ఉండగా, మిగిలిన వారంతా ప్రస్తుతానికి జోడు పడవలపై ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది.
ఆ ముగ్గురూ ఎక్కడి నుంచి?
రాష్ట్రంలో కాంగ్రెస్ తరఫున ముగ్గురు ఎంపీలున్నారు. రేవంత్‌రెడ్డి(మల్కాజ్‌గిరి), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (భువనగిరి) అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి కొడం గల్, నల్లగొండ స్థానాల్లో ఓడిపోయిన తర్వాత ఎంపీలుగా బరిలోకి దిగి విజయం సాధించారు. ఇక, మరో ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (నల్లగొండ) అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచి గెలుపొందినా ఎంపీగా పోటీ చేసి గెలిచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఈ ముగ్గురూ అసెంబ్లీకి పోటీచేయాలనే భావనలో ఉన్నారు. దీంతో మల్కాజ్‌గిరి, భువనగిరి, నల్లగొండ స్థానాల్లో ఎంపీలుగా ఎవరు పోటీ చేస్తారన్న దానిపై స్పష్టత లేకుండాపోయింది. అసలు ఈ లోక్‌సభ స్థానాల్లో పోటీచేసేందుకు ఫలానా అభ్యర్థి ఉన్నారనే చర్చ కూడా పార్టీలో జరగడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment