సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తీరుపై హైకోర్టు అసహనం వ్య క్తం చేసింది. కరీంనగర్ శాసనసభ్యుడు గంగుల కమలాకర్ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌లో అడ్వొకేట్ కమిషనర్ ముందు క్రాస్ ఎగ్జామినేషన్‌కు బండి సంజయ్ గైర్హాజరు కావడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.50 వేల జరిమానా విధించింది.
ఇప్పటికే పలుమార్లు గడువు కోరిన తర్వాత కూడా మళ్లీ గడువు కోరడాన్ని తప్పుబట్టింది. ఎన్నికల పిటిషన్‌లో విచారణను ముగిస్తామని హెచ్చరించింది. ఈ నెల 12న హాజరవుతారని ఆయన న్యాయవాది తెలపడంతో.. జరిమానాతో సరిపెట్టింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.
2018 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుంచి గంగుల కమలాకర్ బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అయితే అఫిడవిట్‌లో గంగుల తప్పుడు వివరాలు ఇచ్చారని, ఆయన ఎన్నిక చెల్లదంటూ తీర్పు ఇవ్వాలని పేర్కొంటూ సమీప ప్రత్యర్థి బండి సంజయ్ హైకోర్టులో 2019, జనవరిలో ఎ న్నికల పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ చిల్లకూర్ సుమలత మంగళవారం మరోసారి విచారణ చేపట్టారు. ఇరుపక్షాల సాక్ష్యాలను నమోదు చేయడంకోసం న్యాయమూర్తి జూన్ లో అడ్వొకేట్ కమిషనర్‌గా రిటైర్డ్ జడ్జి శైలజను నియమించారు. అయితే పార్లమెంట్ సమా వేశాల నేపథ్యంలో సంజయ్ క్రాస్ ఎగ్జామినే షన్‌కు నాలుగుసార్లు గైర్హాజరయ్యారు.
కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరికి 6 నెలల జైలు
కోర్టు ధిక్కరణ కేసులో విశ్వభారతి ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు ఎం.రత్నారెడ్డి, నార్సింగ్ మున్సిపల్ కమిషనర్ పి.సత్యబాబులకు హైకోర్టు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష, రూ. 2 వేలు జరిమానా విధించింది. ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు పది రోజుల గడువు ఇచ్చింది. అప్పటి వరకు తీర్పు అమలును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేసిన రత్నారెడ్డి, అక్రమ నిర్మాణాలను పాక్షికంగా కూల్చివేసి వదిలేసినందుకు కమిషనర్ సత్యబాబుకు శిక్ష విధిస్తూ జస్టిస్ కె.లక్ష్మణ్ ఉత్తర్వులు జారీ చేశారు.
2021, అక్టోబర్ 27 నాటి ఉత్తర్వులకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేసినా చర్యలు లేవంటూ వీరిపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై ఇటీవల తీర్పు వెలువరించారు. మంచిరేవుల గ్రామంలోని రెండు ఎకరాలను విశ్వభారతి లీజుకు తీసుకుని నిర్మాణాలకు హెచ్‌ఎండీఏకు దరఖాస్తు చేసుకుంది. నిర్దిష్ట గడువులోగా అనుమతులు రాకపోవడంతో చట్ట ప్రకారం వచ్చినట్లుగా భావించి నిర్మాణాలు చేపట్టింది. మున్సిపాలిటీ నోటీసులు జారీ చేయడంతో రత్నారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. అనుమతులు ఇవ్వనందున నిర్మాణాలు చేపట్టినట్లుగా పిటిషనర్ సమాచారం ఇవ్వలేదని తప్పుపట్టింది. హెచ్‌ఎండీఏ నోటీసుల్ని పిటిషనర్ సవాల్ చేయకుండా నిర్మాణాలు చేపట్టడంపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ నమోదు కాగా, ఇటీవల పైవిధంగా తీర్పు చెప్పింది.
ఇదీ చదవండి: ఓవైపు పోలీసుల సమీక్ష.. మరోవైపు దొంగల చేతివాటం!
Comments
Please login to add a commentAdd a comment