సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కాళేశ్వరం ప్రాజెక్టుకు, ప్రాజెక్టులో జరిగిన అవినీతికి మద్దతిచ్చిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. ‘మీరు దోచుకోండి.. మా వాటా మాకు ఇవ్వండి’ అనే ధోరణిలో గత పదేళ్లుగా కేంద్రం వ్యవహరించిందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర శాసనసభలో ప్రకటించినట్టుగా వారంలోగా కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణకు ఆదేశిస్తామని వెల్లడించారు.
మంగళవారం ఆయన రాష్ట్ర సచివాలయం మీడియా పాయింట్‌లో విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండించారు. ‘రూ.లక్ష కోట్లు మింగారని మీరే అంటున్నారు. మనీ ల్యాండరింగ్ తప్పకుండా జరిగి ఉంటుంది. అలాంటప్పుడు గత 10 ఏళ్లలో సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలతో విచారణ ఎందుకు జరిపించలేదు’ అని ప్రశ్నించారు.
నిబంధనలను మార్చి కాళేశ్వరానికి రుణాలు..
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీలు గతంలో కేవలం విద్యుత్ రంగ ప్రాజెక్టులకే రుణాలు ఇచ్చేవని, కానీ ఈ సంస్థలు మెమోరాండం ఆఫ్ ఆర్టికల్స్( రాజ్యాంగాల)ను సవరించి కాళేశ్వరం ప్రాజెక్టుకు రుణాలు ఇచ్చాయని ఉత్తమ్‌కుమార్ రెడ్డి వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పీఎఫ్‌సీ రూ.1.27లక్షల కోట్ల రుణాలను మంజూరు చేసి సింహభాగం విడుదల చేసిందన్నారు.
ఆర్‌ఈసీ సైతం మరో రూ.60వేల కోట్ల రుణాలను నీటిపారుదల ప్రాజెక్టులకు ఇచ్చిందన్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీలు అంతకు ముందు నీటిపారుదల ప్రాజెక్టులకు రుణాలు ఇవ్వలేదన్నారు. ఇంత అవినీతి జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం రుణాలకు ఎలా అనుమతిచ్చిందని ప్రశ్నించారు. రూ.80వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతిచ్చిందని, ఆ తర్వాత ప్రాజెక్టు వ్యయాన్ని రూ.1.27లక్షల కోట్లకు పెంచేందుకు ఎలా అనుమతి ఇచ్చారని నిలదీశారు.
కేసీఆర్ మౌనాన్ని ఎందుకు ప్రశ్నించరు?
కేంద్ర సంస్థలు రుణ సహాయం చేసిన మేడిగడ్డ బ్యారేజీ గత అక్టోబర్ 21న కుంగిపోగా, ఇప్పటి వరకు కిషన్ రెడ్డి ఎందుకు సందర్శించలేదని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ఘటనపై గత సీఎం కేసీఆర్ మౌనాన్ని బీజేపీ ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు. గత ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీకి విలేకరులను అనుమతించకపోతే ఎందుకు మాట్లాడలేదు అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం గత ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించలేదన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోని సమస్యలు పరిష్కారమయ్యే వరకు బిల్లుల చెల్లింపులు ఉండవని మంత్రి ఉత్తమ్ తేల్చి చెప్పారు.
కేసీఆర్‌పై ఎందుకు కేసులు పెట్టలేదు
కేసీఆర్, నీటిపారుదల శాఖపై ఎందుకు కేసులు పెట్టలేదని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌కు ఏటీఎం వంటిదని..రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారీ ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపిస్తున్నారని, కానీ విచారణ ఎందుకు జరిపించలేదని నిలదీశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవిత పాత్రపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో సీబీఐకి అనుమతి నిరాకరిస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై తన వద్ద సమాచారం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment