
జగిత్యాల టౌన్: రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. అన్ని వర్గాలను అరిగోస పెడుతున్న కేసీఆర్ ప్రభుత్వం ఇంకా కొనసాగడం రాష్ట్రానికి అరిష్టమని విరుచుకుపడ్డారు. మున్సిపల్ చైర్‌పర్సన్, కౌన్సిలర్ పదవితోపాటు బీఆర్‌ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన బోగ శ్రావణిని శుక్రవారం ఆయన కలిసి సంఘీభావం తెలిపారు.
బీజేపీలో చేరాలని ఆహ్వానించారు. మహిళగా, యువ వైద్యురాలిగా చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన శ్రావణికి ఎంతో భవిష్యత్ ఉందన్నారు. తమతో కలిసి వస్తే బీజేపీలో మంచి అవకాశాలు లభిస్తాయని ఈటల భరోసా ఇచ్చారు. బీఆర్‌ఎస్ పాలనలో ప్రజాప్రతినిధులకు కనీస గౌరవం లేకుండా పోయిందని, అణగారిన వర్గాలు, మహిళలను అవమానా లకు గురిచేస్తున్నారని ఆరోపించారు. శ్రావణి ఇందుకు నిదర్శమని వ్యాఖ్యానించారు.